రిషి కపూర్ జయంతి.. ఆసక్తికర విషయాలు

రిషి కపూర్ జయంతి.. ఆసక్తికర విషయాలు

‘హమ్ తుమ్.. ఏక్ కమ్‌రే మే బంద్‌హో’ అంటూ ఆయన రొమాంటిక్‌ సాంగ్స్ పాడుతుంటే యూత్‌ ఫిదా అయిపోయింది. ‘మై షాయర్‌‌ తో నహీ’ అంటూ వేదాంతాన్ని వల్లిస్తుంటే ప్రేక్షక లోకం చెవులప్పగించింది. ‘ఓం శాంతి ఓం’ అని వెండితెరపై హుషారుగా కాలు కదుపుతుంటే థియేటర్ లలో ఉన్న సినీ ప్రియుల మనసు ఊగిపోయింది. లవర్‌‌ బాయ్‌గా కెరీర్‌‌ స్టార్ట్ చేసి.. ప్రేమ కథలతోనే ఫేమస్ అయ్యి.. రొమాంటిక్‌ హీరో ఇమేజ్‌తో వెలిగిపోయారు. ఆయనే.. రిషి కపూర్. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా రిషి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.. 

రాజ్ కపూర్‌‌కి రెండో కొడుకుగా 1952, సెప్టెంబర్ 4న రిషి జన్మించారు. సినిమా కుటుంబం కావడంతో చిన్నతనంలోనే మేకప్ వేసుకున్నారు. తండ్రి డైరెక్షన్‌లో ‘మేరా నామ్ జోకర్’ సినిమాతో టాలెంట్ ఏంటో ఆయన చూపించారు. ఈ సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డును సైతం అందుకున్నారు. ఆయన తండ్రి డైరెక్ట్ చేసిన ‘బాబి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక రిషికి తిరుగు లేకుండా పోయింది. చబ్బీగా, క్యూట్‌గా ఉండే రిషిని చిన్నప్పుడు అందరూ చాక్లెట్ బాయ్ అనేవారు. హీరో అయ్యాక లవర్‌‌ బోయ్ అనేవారు. ఆయన నటిస్తే ఏ లవ్‌స్టోరీ అయినా హిట్టవ్వాల్సిందే అన్నంత పేరు వచ్చింది.

లైలా మజ్ను, ప్రేమ్ రోగ్, సాగర్, నగీనా, చాందినీ, హీనా, బోల్‌ రాధా బోల్, దివానా లాంటి ఎన్నో సూపర్‌‌ హిట్ రొమాంటిక్ మూవీస్ ఆయన ఖాతాలో ఉన్నాయి. 15 సినిమాల్లో తనతో కలిసి నటించిన ‘నీతూసింగ్‌’ని పెళ్లి చేసుకున్నారు. తన కెరీర్‌‌లో, లైఫ్‌లో సాధించిన విజయాలన్నింటిలో తన భార్యకి మేజర్ షేర్ ఉందని చెప్పేవారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక కూడా వీరిద్దరూ కలిసి ఒకట్రెండు సినిమాలు చేశారు. హీరోగా ఎంతగా వెలిగిపోయారో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అంతే బిజీగా ఉండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు.. రణ్‌బీర్, రిధిమ. అలియా భట్ వీరి కోడలు. నిజానికి తన తండ్రిలా మంచి దర్శకుడు కావాలనేది రిషి కోరిక. హీరోగా ఎంత ఎదిగినా ఆ ఆశ పోలేదు. దాంతో మెగాఫోన్ పట్టి ‘ఆ అబ్ లౌట్ చలే’ అనే సినిమా తీశారు. ఇందులో అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యారాయ్ జంటగా నటించారు. అయితే సినిమా బాక్సాపీస్ వద్ద పరాజయం కావడంతో మళ్లీ డైరెక్షన్ జోలికి పోలేదు. 

సోలో హీరోగా ఎంత డిమాండ్ ఉన్నా.. ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఏ మాత్రం సంశయించలేదు. బదల్తే రిస్తే, ఖేల్ ఖేల్‌ మే, నసీబ్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి సినిమాల్లో ఇతర హీరోలతో కలిసి నటించారు. తోటి హీరోలతో మంచి రిలేషన్‌ని పెంచుకున్నారు. బెస్ట్ హీరోగానే కాక మంచి వ్యక్తిగానూ పేరు తెచ్చుకున్నారు. ‘డర్’ సినిమాలో షారుఖ్ చేసిన పాత్రని మొదట రిషికే యశ్‌ చోప్రా ఆఫర్ చేశారట. కానీ నెగటివ్ రోల్ సూట్ కాదని రిషి నో చెప్పారు. సన్నీ డియోల్ పాత్ర చేయమంటే అందుకు కూడా ఆయన ఇష్టపడలేదట. పైగా నెగటివ్ రోల్‌కి షారుఖ్‌ పేరును ఆయనే ప్రపోజ్ చేశారు. అది షారుఖ్ కెరీర్‌‌ని ఎంత పెద్ద మలుపు తిప్పిందో తెలిసిందే. 

మనసులో ఏదీ దాచుకోరని, నిర్మొహమాటంగా మాట్లాడేస్తారని రిషికి పేరు. అదెంత నిజమో ఆయన ఆత్మకథ ‘ఖుల్లమ్ ఖుల్లా’ చదివితే అర్థమవుతుంది. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఇందులో ఓపెన్‌గా చెప్పారు. ఓ పార్శీ అమ్మాయిని ప్రేమించానని, తన తొలి సినిమా హీరోయిన్ డింపుల్ కపాడియాను ఇష్టపడ్డానని, అమితాబ్‌ తనతో ఎప్పుడూ స్నేహంగా ఉండేవారు కాదని.. ఇలా ఎన్నో రాశారు. ఓ సమయంలో అమితాబ్‌కి రావాల్సిన అవార్డును తాను డబ్బిలిచ్చి కొనుక్కున్న విషయాన్ని కూడా దాచకుండా ఈ పుస్తకంలో చెప్పేయడం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. అయితే 2018లో ఆయనకి క్యాన్సర్ సోకింది. న్యూయార్క్ వెళ్లి సంవత్సరం పాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. కోలుకుంటారని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు. 2020, ఏప్రిల్ 30న రిషి కన్నుమూశారు. చనిపోయేనాటికి ఆయన చేతిలో నాలుగైదు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఆ వయసులోనూ నటుడిగా ఉన్న క్రేజ్, డిమాండ్, ఫాలోయింగ్ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.