- వెలవెలబోతున్న ఖమ్మం - కురవి రోడ్డు
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం నుంచి కురవి వెళ్లే రోడ్డులో 1984లో నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం హయాంలో నాటిన చెట్లు 40 ఏళ్లుగా ప్రజలకు నీడనిస్తున్నాయి. ఇప్పుడు నేలకొరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డును విస్తరించాలనే డిమాండ్‌తో ప్రభుత్వం నాలుగు లేన్ల రోడ్డుతో పాటు డివైడర్ మంజూరు చేసింది. రోడ్డు విస్తరణకు అడ్డువస్తున్న చెట్లను కాంట్రాక్టర్ పది రోజులుగా నరికి వేస్తున్నారు.
40 ఏళ్లుగా నీడనిస్తున్న చెట్లు ఒక్కసారిగా కుప్పకూలుతుండడంతో ఖమ్మం–కురివి రోడ్డు వెలవెలబోతోంది. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న పద్మశ్రీ వనజీవి రామయ్య ఈ వృక్షాలకు వేసవికాలంలో నీళ్లుపోసి పెంచారు. ఇప్పుడు ఆ చెట్లను నరుకుతుండడంతో ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి భాగంగా చెట్లను నరుకుతున్నందున ఒక్క చెట్టు స్థానంలో రెండు మొక్కలు నాటాలని, రహదారి పూర్తయిన వెంటనే ఇరువైపులా విస్తారంగా మొక్కలతో కళకళలాడేలా చూడాలని పలువురు కోరుతున్నారు.