గూడాపూర్​లో 41 డిగ్రీలు నమోదు

గూడాపూర్​లో 41 డిగ్రీలు నమోదు
  •     మార్చిలోనే ఆదిలాబాద్ లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు
  •     రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 40 డిగ్రీలపైనే
  •     ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనాలు

ఆదిలాబాద్, వెలుగు : రాష్ట్రంలో సాధారణం కంటే నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే మార్చి లోనే రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని గూడాపూర్ లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గతేడాది ఈ సమయానికి 37 డిగ్రీలే రికార్డ్​ అయ్యింది.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

నల్గొండ జిల్లా ఇబ్రహీంపేట, చందూర్ , మాడుగులపల్లి, వనపర్తి జిల్లా పెబ్బేర్ ,40.9 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ 40.8 డిగ్రీలు, నల్గొండ జిల్లా తేల్దేవరపల్లి, గద్వాల, వనపర్తి జిల్లా దగడ, మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ,  నాంపల్లి, 40.7 డిగ్రీలు, ఖమ్మం జిల్లా కొణిజెర్ల, జగిత్యాల జిల్లా ధర్మపురి, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, యాదాద్రి జిల్లా మోత్కూరు, సిద్దిపేట జిల్లా చిట్యాల్​లో 40.5 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ 40.4, నిజామాబాద్​లో 40.3, మెదక్​ జిల్లా వెల్దుర్తి, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట,  సూర్యాపేట జిల్లా అనంతగిరిలో 40.2 డిగ్రీలు, కాగజ్ నగర్​లో  40.1,  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో గతేడాది ఇదే రోజు 37 నుంచి 39 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా ఈ సారి ఉష్ణోగ్రతలు పెరిగాయి. 

రెండు నెలలు జాగ్రత్తలు తప్పనిసరి

మార్చి రెండో వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎండలు పెరుగుతుండగా  మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వడగాలులు వీస్తున్నాయి. దీంతో మధ్యాహ్నం నుంచి బయటకు రావాలంటే పబ్లిక్​ భయపడ్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల భూగర్బజలాలు అడుగంటి పోతున్నాయి. 

ప్రాజెక్టుల్లో సైతం నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య తలెత్తవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్​కు గురయ్యే ప్రమాదమున్నందున తరుచూ నీళ్లు తాగాలని, బయటకు వెళ్తే తప్పకుండా వాటర్​ బాటిల్​ వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.