
- దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ కుట్ర
సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఇందుకు ఈనెల 9,10 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఎం సూర్యాపేట జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీసీల రిజర్వేషన్లు మైనార్టీలకు దక్కకుండా, దేశాన్ని విభజించేందుకు బీజేపీ కుట్ర నాటకం ఆడుతుందని ఆరోపించారు. గుజరాత్, యూపీ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ, తెలంగాణలో వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు జరిగేలా కేంద్రం చట్టం చేయాలని ఆ పార్టీ ఎంపీలు, కేంద్రమంత్రులు ఒత్తిడి తేవాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అమెరికాలో ఉత్పత్తయ్యే వస్తువులు మన దేశంలో దిగుమతికి ఎలాంటి పన్నులు వేయకూడదని ప్రధాని మోదీపై ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. అంతకుముందు బిహార్ లో మత ప్రాతిపాదకన ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ టౌన్ లో భారీ ర్యాలీ తీసి.. కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, నేతలు పాండు, మట్టిపెల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.