
నేపాల్ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. 2025, మే 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో ఊగిపోయింది నేపాల్ దేశం. పోఖారా ఏరియాకు సమీపంలోని కాస్కి జిల్లా కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటించింది. భూకంపం తీవ్రత చాలా దూరంగా వరకు వ్యాపించిందని స్పష్టం చేసింది.
కస్కిలోనే కాకుండా సియాంజ్గా, తనహున్, పర్బాత్, మయాగ్డి, బాగ్లంగ్ జిల్లాల్లోనూ భూమి కంపించినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.
వారం రోజుల్లో నేపాల్ కేంద్రంగా ఇది మూడో భూకంపం కావటం భయాందోళనలను పెంచుతుంది. మే 14వ తేదీన తూర్పు నేపాల్ లోని సోలుఖుంబు కేంద్రంగా భూకంపం వచ్చింది. మే 15వ తేదీన కూడా ఇదే ప్రదేశంలో రెండోసారి భూమి కంపించింది. ఇప్పుడు మూడోసారి కూడా అదే ప్రాంతంలో భూకంపం రావటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో.. మే నెలలోనే.. వారం రోజుల్లో మూడుసార్లు నేపాల్ లోని సోలుఖుంబు ప్రాంతం కేంద్రంగా భూకంపాలు రావటం.. అది కూడా తీవ్రత 4 పాయింట్లపైనే ఉండటంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రాంతం కింద టెక్టోనిక్ ప్లేట్లు ఉన్నాయని.. వీటి కదలిక ఎక్కువగా ఉందని.. అందుకే తరచుగా వస్తు్న్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
2015లో ఇదే ప్రాంతంలో ఏర్పడిన భూకంపం వల్ల 9 వేల మంది చనిపోగా.. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఆ తర్వాత ఆ స్థాయి తీవ్రతతో భూకంపం రాకపోయినా.. ఇటీవల కాలంలో.. ముఖ్యంగా ఈ మే నెలలో.. వారం రోజుల్లోనే మూడు సార్లు భూకంపం రావటం.. అది కూడా 4 పాయింట్ల తీవ్రత కంటే ఎక్కువగా ఉండటం అనేది భయాందోళనలకు గురి చేస్తోంది. నేపాల్ లో భూకంపం వస్తే.. అది ఉత్తరభారతదేశాన్ని.. ముఖ్యంగా ఢిల్లీని కూడా వణికిస్తుంది.
మే 20వ తేదీ వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఆస్తి నష్టంపై ఇంకా ప్రకటన చేయలేదు.