నెల రోజుల్లో 4.71 లక్షల కొత్త ఓటర్లు

నెల రోజుల్లో 4.71 లక్షల కొత్త ఓటర్లు
  • హైదరాబాద్‌లోనే లక్షకు పైగా నమోదు
  • ఓటర్ దరఖాస్తుకు గడువు పెంపు
  • ఈనెల 10 దాకా అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ఓటర్ దరఖాస్తు ప్రక్రియకు భారీగా స్పందన వచ్చింది. అక్టోబర్‌‌ 1 నుంచి 31వ తేదీ మధ్య రాష్ట్రంలో కొత్తగా 4.71 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని అధికారులు తెలిపారు. ఇందులో హైదరాబాద్ నుంచి లక్షకు పైచిలుకు కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. దరఖాస్తు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరో పది రోజులపాటు గడువు పెంచారు. ఈనెల పదో తేదీ వరకు ఆన్​లైన్‌లో ఓటర్ కార్డు కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. 

గత నెలలోనే తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లుగా నమోదైనట్టు వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఇటీవల ప్రారంభించింది. ఈ నేపథ్యంలో దాదాపు 10 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నెల రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 4,71,421 ఓటర్లు అదనంగా నమోదైనట్టు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం ఓటర్లలో 1.59 కోట్ల మంది పురుషులు, 1.58 కోట్ల మంది మహిళలు, 2,583 మంది ఇతరులు ఉన్నట్టు వెల్లడించారు.