
2008లో జరిగిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందుతులను దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్ లను దోషులుగా నిర్దారించగా, వారికి సాయం చేసిన అభియోగాలపై ఐదో నిందితుడిగా అజయ్ సేథీని దోషిగా ప్రకటించింది . త్వరలోనే న్యాయస్థానం వీరికి శిక్షను ప్రకటించనుంది.
25 ఏళ్ల జర్నలిస్ట్ సౌమ్య 2008 సెప్టెంబర్ 30న ఢిల్లీలోని వసంత్ విహార్‌లో ఆమె పని నుండి తిరిగి వస్తుండగా హత్య చేయబడింది. కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె తలకు గాయమైంది. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ముందుగా ఇది రోడ్డు ప్రమాదమని పోలీసులు భావించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఆమె తలకు బుల్లెట్ తగిలిందని తేలడంతో ఇది హత్యగా భావించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2009లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దోపిడీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. తాజాగా వారిని దోషులుగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం సౌమ్య తల్లి మీడియాతో మాట్లాడుతూ..దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు. తమ కూతుర్ని కోల్పోయి 15 ఏళ్లుగా తాము అనుభవించిన బాధనే వాళ్లూ అనుభవించాలన్నారు.