బంగారం, ఫిక్స్​డ్​ డిపాజిట్లకు మహిళల ఆసక్తి

బంగారం, ఫిక్స్​డ్​ డిపాజిట్లకు మహిళల ఆసక్తి

న్యూఢిల్లీ: మనదేశంలో ఎక్కువ మంది మహిళలు బంగారం, ఫిక్స్​డ్​ డిపాజిట్లలో (ఎఫ్​డీ) ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తాజా సర్వేలో తేలింది. రిస్క్ లేని ఇన్వెస్ట్​మెంట్లనే ఎంచుకుంటున్నారని వెల్లడయింది. బయ్ నౌ, పే లేటర్ లోన్లు ఇచ్చే జెస్ట్ మనీ మహిళల ఇన్వెస్ట్​మెంట్​ విధానాలపై సర్వే చేసింది. దీని రిపోర్టు ప్రకారం, సర్వేలో పాల్గొన్న మహిళల్లో 59శాతం మంది రెస్పాండెంట్లు బంగారం,  ఫిక్స్‌‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. 31శాతం మంది మ్యూచువల్ ఫండ్స్,  ఈక్విటీలను ఎంచుకున్నారు. భారతదేశంలోని కీలక మెట్రోలు,  టైర్ 2/3 నగరాల్లో ఉంటున్న 1,900 మంది రెస్పాండెంట్లతో సర్వే జరిగింది. వీరిలో ఎక్కువ మంది జెనరేషన్ జెడ్  మిలీనియల్స్ (1997– 2012 మధ్య పుట్టినవారు) ఉన్నారు.  రికరింగ్ డిపాజిట్లు, రియల్ ఎస్టేట్,  క్రిప్టోకరెన్సీ వంటి వాటిలో తక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారని  జెస్ట్‌‌మనీ సీఈఓ  లిజ్జీ చాప్‌‌మన్  అన్నారు. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న  మిలీనియల్ మహిళలు సురక్షితమైన,  తక్కువ రిస్కు ఉండే వాటిలో పొదుపు చేస్తున్నారని అన్నారు. బంగారం, ఎఫ్​డీలు వారి మొదటి చాయిస్​  అని,  కొందరు మ్యూచువల్ ఫండ్స్ లో, ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని వివరించారు. వారికి అన్ని రకాల పెట్టుబడులపైనా అవగాహన ఉందని లిజ్జి అన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోందని,  సంపదను పెంచడంలో మహిళలు భాగమవుతున్నారని పేర్కొన్నారు. 

లాంగ్​టర్మ్​ ఇన్వెస్ట్​మెంట్లకూ ఓకే

ఈ  సర్వే ప్రకారం, మహిళలు తక్కువ రిస్క్ ఉండే వాటిని మాత్రమే కాకుండా దీర్ఘకాలిక పెట్టుబడులను కూడా ఇష్టపడుతున్నారు.   రెస్పాండెంట్లలో 93శాతం మంది ఫుల్ టైం ఎంప్లాయీస్ లేదా స్వయం ఉపాధి పొందుతున్నారు. దాదాపు 80శాతం మంది రెస్పాండెంట్లు 2022 కోసం లక్ష్యాల​-ఆధారిత పెట్టుబడి లక్ష్యాలను (గోల్ ఓరియెంటెడ్ ఇన్వెస్ట్​మెంట్లు) పెట్టుకున్నామని చెప్పారు. పర్సనల్ ఫైనాన్స్‌‌పై  మహిళల్లో అవగాహన పెరిగిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని లిజ్జీ పేర్కొన్నారు. ఎక్కువ మంది మహిళలకు ఇల్లు కొనడం (25శాతం), వారి పిల్లల భవిష్యత్తు (23శాతం)  రిటైర్మెంట్ సేవింగ్స్ (15శాతం)లు మొదటి మూడు టార్గెట్లు. వీటి కోసం ఎక్కువ పొదుపు చేస్తున్నారు. కారు కొనడం, హాలిడేస్​కు వెళ్లడం, పెళ్లి చేసుకోవడం వంటివి ఇతర లక్ష్యాలలో ఉన్నాయి. మెజారిటీ  మహిళలు తమ ఆర్థిక స్వాతంత్య్రాన్ని వాడుకుంటున్నారు. ఇండ్లను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు.  అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తాజా రిపోర్టు ప్రకారం ఈ రోజుల్లో పురుషుల కంటే 15శాతం ఎక్కువ మంది మహిళలు ఇండ్లను కొంటున్నారు. రియల్ ఎస్టేట్‌‌పై మహిళలకూ ఆసక్తి పెరగడం విశేషం. రియల్ ఎస్టేట్‌‌ బిజినెస్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నదని రహేజా కార్ప్ హోమ్స్ సిఇఒ రమేష్ రంగనాథన్ అన్నారు.

10 గ్రాముల ధర రూ.56 వేలు

చమురు ధరల మాదిరిగానే బంగారం ధరలూ వేగంగా పెరుగుతున్నాయి. ఇండియాలో మంగళవారం బంగారం ధర 19 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్‌‌లో ఉదయాన్నే డీల్‌‌లలో రూ.54,000 స్థాయిలను తిరిగి చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో​ బంగారం ధర 10 గ్రాముల ఇంట్రాడే హై రూ.54,190కి చేరుకుంది. ఇది ఆగస్టు 2020లో రికార్డయిన ఆల్-టైమ్ హై రూ.56,191లకు కేవలం రూ.2,000 దూరంలో ఉంది. స్పాట్ బంగారం ధర కూడా ఔన్సు 2020 డాలర్ల వరకు పెరిగింది. లైఫ్​ టైం హై ధర 2075 డాలర్ల స్థాయికి కేవలం 55 డాలర్ల దూరంలో ఉంది.  రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం మరింత పెరగడం, యూఎస్​ ఫెడ్ వడ్డీ రేటు పెంపుదల, ముడి చమురు,  ఇతర వస్తువుల ధరలు పెరగడం, రూపాయి  విలువ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధర ఆకాశాన్ని తాకింది.    ఐఐఎఫ్‌‌ఎల్‌‌ సెక్యూరిటీస్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ అనూజ్‌‌ గుప్తా మాట్లాడుతూ.. రష్యా-–ఉక్రెయిన్‌‌ టెన్షన్‌‌ తీవ్రతరం కావడంతో బంగారం ధరలు 19 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఉక్రెయిన్‌‌ సరిహద్దుకు సమీపంలో అమెరికా యుద్ధ విమానాలు ఎగరడం భౌగోళిక, రాజకీయ టెన్షన్లను మరింత పెంచాయని చెప్పారు.  కమోడిటీ ధరలు, ముఖ్యంగా ముడి చమురు,  లోహాల ధరలు చాలా పెరిగాయని పేర్కొన్నారు. డాలర్‌‌తో రూపాయి మారకంలో పతనం బంగారం ధర ర్యాలీకి ట్రిగ్గర్‌‌గా పని చేస్తోందని వివరించారు.