తలాక్ బిల్లు..ఈ ఐదుగురి విజయమిది..

తలాక్ బిల్లు..ఈ ఐదుగురి విజయమిది..

ట్రిపుల్​తలాక్​ బిల్లును రాజ్యసభ ఆమోదించడాన్ని ఆ ఐదుగురు మహిళలు స్వాగతించారు. ఏళ్ల తరబడి సాగిన పోరాటం తర్వాత విజయం వరించిందని ఆనందిస్తున్నారు. తమలాంటి బాధితులకు అండగా నిలవడంతో పాటు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ధైర్యమిచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని అన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్​దాఖలుతో మొదలెట్టిన తమ పోరాట ఫలితం మొదట అత్యున్నత న్యాయస్థానంలో తర్వాత ఇప్పుడు పార్లమెంట్​లో కనిపిస్తోందని చెప్పారు. ఆ ఐదుగురు.. ఉత్తరాఖండ్​కు చెందిన షయరా బానో, యూపీకి చెందిన గుల్షన్​పర్వీన్, అతియా సాబి, రాజస్థాన్​కు చెందిన అఫ్రీన్​రెహ్మాన్, పశ్చిమ బెంగాల్​కు చెందిన ఇష్రత్​జహాన్.

షయరా బానో

ఉత్తరాఖండ్​లోని కాశీపూర్​కు చెందిన షయరా బానో ట్రిపుల్​తలాక్​పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తొలి మహిళ.. ఎమ్మె సోషియాలజీ చదివిన బానోకు ఆమె భర్త రిజ్వాన్​అహ్మద్​2015లో డైవోర్స్​ఇచ్చాడు. షయరా పుట్టింటికి వెళ్లిన సమయంలో లెటర్​ద్వారా రిజ్వాన్ ​ట్రిపుల్​తలాక్​చెప్పాడు. తర్వాత ఇద్దరు పిల్లలను తీసుకుని సొంతూరు అహ్మదాబాద్​కు వెళ్లాడు. భర్త రాసిన లెటర్​ను మతపెద్దలకు చూపించగా.. అది చెల్లుబాటవుతుందని వారు చెప్పారు. దీంతో మానసికంగా కుంగిపోయిన షయరా కోలుకోవడానికి నెలలు పట్టింది. ఆపై ఆమె ట్రిపుల్​తలాక్, హలాలా అంశాలను సవాల్​చేస్తూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2017 లో కోర్టు ట్రిపుల్​తలాక్​చెల్లదంటూ కోర్టు తీర్పివ్వడంతో ముస్లిం మహిళలకు అదో చరిత్రాత్మక రోజని షయరా సంతోషం వ్యక్తం చేశారు.

అఫ్రీన్రెమ్మాన్

రాజస్థాన్​లోని జైపూర్​కు చెందిన అఫ్రీన్​రెహ్మాన్ గృహహింస, కట్నం వేధింపుల బాధితురాలు.. మాట్రిమోనియల్​పోర్టల్​ద్వారా ఇండోర్​కు చెందిన సయ్యద్​అషర్​అలి వర్సిని ఆమె 2014లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొన్ని నెలలకే అత్తింటి వారు ఆమెను మానసికంగా, శారీరకంగా హింసలకు గురిచేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు 2015లో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని బెదిరించారని అఫ్రీన్​చెప్పారు. ప్రాణభయంతో పుట్టింటికి చేరిన అఫ్రీన్​కు 2016 జనవరిలో భర్త నుంచి తలాక్ లెటర్​అందింది. అంతకుముందు బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుంది, కాళ్లు విరిగాయి. సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టడంతో డిప్రెషన్​కు లోనైన అఫ్రీన్.. తర్వాత కోలుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గుల్షన్ పర్వీన్

ఉత్తరప్రదేశ్​లోని రాంపూర్​కు చెందిన గుల్షన్​పర్వీన్ డౌరీ బాధితురాలు.. రెండేళ్ల పాటు అదనపు కట్నం కోసం భర్త హింసించాడు. 2015లో ఆమెను పుట్టింటికి పంపించి, స్టాంప్​పేపర్​పై తలాక్​ నామా రాసి పోస్టులో పంపించాడు. ఆ లెటర్​తో తను, తన కొడుకు నిరాశ్రయులమైపోయామని పర్వీన్​ చెప్పారు. ఆ విడాకులను అంగీకరించేది లేదని, పర్వీన్​న్యాయపోరాటం ప్రారంభించారు. వరకట్న వేధింపుల చట్టం కింద భర్తను జైలుకు పంపించి, ట్రిపుల్​తలాక్​ను రద్దు చేయాలంటూ గుల్షన్​పర్వీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అతియా సాబ్రి

ఉత్తరప్రదేశ్​లోని షహరన్​పూర్​కు చెందిన అతియా సాబ్రికి 2012లో పెళ్లయింది. భర్త వాజిద్​అలి. పదమూడేళ్ల కాపురం తర్వాత వాజిద్​అలి ఓ చిన్న కాగితంపై ట్రిపుల్​తలాక్​రాసి అతియా సోదరుడి ఆఫీస్​కు పోస్ట్​లో పంపించాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో అత్తింటి వాళ్లు మాటలతో వేధించారని, ఒకరోజు ఆహారంలో విషం కలపడంతో తాను ఆస్పత్రి పాలయ్యానని అతియా వివరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాజిద్​ను అరెస్టు చేశారని అన్నారు. లెటర్​ద్వారా డైవోర్స్​ఇవ్వడాన్ని అతియా తప్పుబట్టారు. ట్రిపుల్​తలాక్​మహిళల ప్రాథమిక హక్కులను అణిచివేస్తోందని ఆరోపిస్తూ అతియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు

ఇష్రత్జహాన్

పశ్చిమ బెంగాల్​లోని హౌరాకు చెందిన ఇష్రత్​జహాన్​కు ఆమె భర్త ముర్తజా ఫోన్​లో విడాకులిచ్చాడు. పదిహేను సంవత్సరాల కాపురం తర్వాత దుబాయ్​నుంచి ఫోన్​చేసిన ముర్తజా.. మూడుసార్లు తలాక్​చెప్పి, ఫోన్​పెట్టేశాడు. తర్వాత ఇండియాకు వచ్చి మరో పెళ్లి చేసుకోవడంతో పాటు నలుగురు పిల్లలను తీసుకొని పోయాడని ఇష్రత్​చెప్పారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక తన కాపురంలో కలతలు స్టార్టయ్యాయని అన్నారు. ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో తనకు మగపిల్లాడు కావాలని, దానికోసం మరో పెళ్లి చేసుకుంటానని ముర్తజా తరచుగా అంటుండడం గొడవలకు దారితీసిందన్నారు. 2010లో ఇష్రత్​మగపిల్లాడికి జన్మనిచ్చినా వారి బంధం కొనసాగలేదు. దీంతో కోర్టుకెక్కిన ఇష్రత్..  విడాకులకు తాను వ్యతిరేకం కాదని, విడాకుల ప్రాసెస్​న్యాయబద్ధంగా ఉండాలన్నదే తన డిమాండ్​అని చెప్పారు.