ఆనవాళ్లు కూడా వదల్లేదు : పొలంలోని సెల్ టవర్ మొత్తం ఎత్తుకెళ్లారు..

ఆనవాళ్లు కూడా వదల్లేదు : పొలంలోని సెల్ టవర్ మొత్తం ఎత్తుకెళ్లారు..

ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన దొంగతనం జరిగింది.  కౌశాంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో ఉన్న 10 టన్నుల బరువున్న 50 మీటర్ల ఎతైన మొబైల్ టవర్ ను దుండగులు ఎత్తుకెళ్లారు.  అయితే మార్చి 31 నుంచి టవర్ కనిపించడం లేదని టెక్నీషియన్ రాజేష్ కుమార్ యాదవ్ తన ఫిర్యాదులో తెలిపాడు.   మొబైల్ టవర్ తో పాటుగా రూ.  8.5 లక్షల విలువైన   షెల్టర్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు  ఇతర పరికరాలు కూడా మాయమైనట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నాడు.  

దొంగతనం జరిగిన ఎనిమిది నెలల తర్వాత అతను ఎందుకు ఫిర్యాదు చేశాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   టెక్నీషియన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు IPC సెక్షన్ 379 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  రాజేష్  తన ఫిర్యాదులో తమ  కంపెనీ జనవరి 2023 లో ఉజ్జయిని గ్రామంలో ఉబిద్ ఉల్లా అనే వ్యక్తి యొక్క పొలంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేసింది. మార్చి 31న అతను తనిఖీ కోసం వెళ్లినప్పుడు అక్కడ టవర్ జాడ లేకుండా కనిపించకుండా పోయిందని తెలిపాడు.  

అయితే ఇలా టవర్ దొంగతనలు జరగడం కొత్తేమీ కాదు.  ఈ ఏడాది ఏప్రిల్‌ ప్రారంభంలో బీహార్‌లో ప్రభుత్వ అధికారులుగా నటిస్తున్న దొంగలు 60 అడుగుల ఇనుప వంతెనను కూల్చి చోరీ చేశారు. బ్రిడ్జిని స్క్రాప్‌గా విక్రయించేందుకు దొంగిలించారని, యూపీలోని టవర్ విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.