ఆడిటింగ్ చేసేందుకు రూ.50వేలు లంచం

ఆడిటింగ్ చేసేందుకు రూ.50వేలు లంచం

నాంపల్లి,వెలుగు: ఓ వ్యాపారికి చెందిన పైపుల షాప్ ఆడిటింగ్ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ సరూర్ నగర్ ఏసీటీవో(అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్) ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం..శంషాబాద్ కి చెందిన వ్యాపారి మాదిరెడ్డి రాజిరెడ్డి తన పైపుల షాప్ ఆడిటింగ్ కోసం సరూర్ నగర్ ఏసీటీవోగా పనిచేస్తున్న శివకుమార్ దగ్గరికి వెళ్లాడు. ఐదేళ్ల ఆడిటింగ్ కి గాను ఏడాదికి రూ.15వేల చొప్పున రూ.75 వేలు లంచంగా ఇవ్వాల్సిందిగా ఏసీటీవో శివకుమార్ వ్యాపారి రాజిరెడ్డిని డిమాండ్ చేశాడు. దీంతో రాజిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

మంగళవారం నాంపల్లి లోని డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో  రాజిరెడ్డి దగ్గరి నుంచి ఏసీటీవో శివకుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శివకుమార్ ని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కి తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. శివకుమార్ కి అక్రమాస్తులు ఉన్నాయనే కోణంలో విచారిస్తున్నామని..కొంపల్లిలోని బ్యాంక్ కాలనీలో ఉండే అతడి ఇంట్లో సోదాలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.