
- త్వరలో 5 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ల భర్తీ: మంత్రి పొంగులేటి
- సర్వేయర్ల శిక్షణకు ఈ నెల 17 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూ సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలకం కానుందని చెప్పారు. ప్రభు త్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 402 మంది సర్వేయర్లు సరిపోరని, మరికొంత మంది అవసరమవుతారని తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడంతోపాటు మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ శాఖపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండలం, పట్టణంలో భూ విస్తరణ, భూ లావాదేవీలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామని వెల్లడించారు.
ఎంపికైన అభ్యర్థులకు 50 రోజులు శిక్షణ
లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు అర్హత గలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 17 వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియెట్ (మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్‌గా) కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఐటటీఐ నుంచి డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బి.టెక్ (సివిల్) లేదా ఇతర సమానమైన విద్యార్హత కలిగి ఉండాలని తెలిపారు.