53 లక్షల మంది ఇన్వెస్టర్లు..స్టాక్​ మార్కెట్​కు​ దూరం

53 లక్షల మంది ఇన్వెస్టర్లు..స్టాక్​ మార్కెట్​కు​ దూరం

న్యూఢిల్లీ: కరోనా లాక్​డౌన్ ​సమయంలో మార్కెట్లో విపరీతమైన జోష్​ కనిపించింది. చాలా మంది స్టాక్​ మార్కెట్​కు పరిచయమయ్యారు. ముఖ్యంగా యువత రోజూ స్మార్ట్​ఫోన్లు/కంప్యూటర్ల ముందు కూర్చొని గంటల తరబడి ట్రేడింగ్​ చేశారు. అప్పుడు వర్క్​  ఫ్రం హోం విధానం ఉండటం కూడా ఇందుకు కారణం. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మార్కెట్ల నుంచి పెద్దగా లాభాలను రాబట్టు కోలేకపోవడంతో వీరిలో మెజారిటీ ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారు.  గడిచిన 9 నెలల్లో ఎక్స్ఛేంజ్  యాక్టివ్ క్లయింట్ సంఖ్య 53 లక్షలు తగ్గిందని ఎన్​ఎస్​ఈ  తాజా డేటా చూపిస్తోంది. ఎన్​ఎస్​ఈలో యాక్టివ్ క్లయింట్‌‌‌‌ల సంఖ్య మార్చిలో వరుసగా తొమ్మిదో నెలలో 3.27 కోట్లకు తగ్గింది. పోయిన ఏడాది జూన్​లో ఇది 3.8 కోట్లు ఉండేది. అంటే అప్పటి నుంచి 53 లక్షల మంది మార్కెట్​కు దూరమయ్యారు.  లాక్‌‌‌‌డౌన్ నాటి ఉత్సాహం ఇప్పట్లో కనిపించడం లేదని బ్రోకర్లు చెబుతున్నారు.  ఎన్​ఎస్​ఈ డేటా ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లోలు గత మూడేళ్లలో కనిష్టంగా రూ. 49,200 కోట్లుగా ఉన్నాయి. 2021–-22 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ. 1.65 లక్షల కోట్లు ఉండేది.  2020-–21 ఆర్థిక సంవత్సరం లో రూ. 68,400 కోట్ల ఇన్​ఫ్లోతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది.  ఈ ఏడాది మార్చిలో బీఎస్​ఈ,  ఎన్​ఎస్​ఈ క్యాష్ ​ మార్కెట్‌‌‌‌లో  రిటైల్ ఇన్వెస్టర్ల రోజువారీ సగటు టర్నోవర్ 29 శాతం తగ్గి రూ. 23,700 కోట్లకు పడిపోయింది.   కొత్త డీమ్యాట్ ఖాతాల వేగం మందగిస్తోంది.  కొత్త ఖాతాల సంఖ్య నెలవారీగా ఎనిమిది శాతం తగ్గి19 లక్షలకు చేరింది. 

ఎందుకు ఇలా?

గడిచిన ఒకటిన్నర సంవత్సరాలలో పెద్దగా లాభాలు రాకపోవడంతో చాలా మంది ట్రేడింగ్​ను వదిలేస్తున్నారని మార్కెట్ ఇన్‌‌‌‌సైడర్‌‌‌‌లు అంటున్నారు. కరోనా లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ల సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఖాళీ సమయం దొరకడం యువకుల్లో ట్రేడింగ్​ ఫ్యాషన్‌‌‌‌గా మారింది. కరోనా క్రాష్ తర్వాత వచ్చిన వన్-వే ర్యాలీతో రాత్రిరాత్రికి కోటీశ్వరులు కావాలని కలలుగన్న కొత్త ట్రేడర్లు కొందరు చివరికి నష్టాల పాలయ్యారు.  స్టాక్​ మార్కెట్లో నెగ్గుకు రావడం అంత సులభం కాదని గ్రహించారు.  అనుభవం లేని కొందరు ట్రేడర్లు ఎవరో ఇచ్చిన టిప్స్​ ఆధారంగా మార్కెట్లో ఇన్వెస్ట్​ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి వాళ్లు ‘మార్కెట్​ వేస్ట్​’ అంటూ బయటకు వస్తున్నారని ఒక బ్రోకర్ వివరించారు.  రైట్ రీసెర్చ్ ఫౌండర్​ సోనమ్  శ్రీవాస్తవ ఈ విషయం గురించి మాట్లాడుతూ బాండ్లు,  ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్ల వల్ల రిస్క్​ ఉండదని, స్థిరమైన ఆదాయం వస్తుంది కాబట్టి చాలా మంది దృష్టి అటువైపు మళ్లిందని అభిప్రాయపడ్డారు.  క్రిప్టో కరెన్సీలు,  రియల్ ఎస్టేట్ వంటి అసెట్​క్లాసులు మంచి రాబడులు ఇస్తుండటంతో వాటివైపు కొందరు వెళ్లారని ఆమె వివరించారు. దలాల్ స్ట్రీట్‌‌‌‌లో రిటైల్ ఇన్వెస్టర్ల  సంఖ్య తగ్గినా, మ్యూచువల్ ఫండ్స్‌‌‌‌లోకి డబ్బు మాత్రం భారీగా వస్తోంది. ఈ ఏడాది దాదాపు రూ. 14,300 కోట్ల విలువైన సిస్టమాటిక్​ఇన్వెస్ట్​మెంట్​ప్లాన్​(సిప్) ఇన్​ఫ్లోలు వచ్చాయి. పోయిన నెల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నికర ఇన్‌‌‌‌ఫ్లో భారీగా పెరిగింది. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్  ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్ మెహతా మాట్లాడుతూ మార్కెట్లలో ట్రేడర్ల సంఖ్య తగ్గుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హెచ్చుతగ్గులు సహజమని అన్నారు.