జీహెచ్ఎంసీకి సర్కారు చెల్లించాల్సిన ఆస్తి పన్నుల బకాయిలను ఇస్తలేదు

జీహెచ్ఎంసీకి సర్కారు చెల్లించాల్సిన ఆస్తి పన్నుల బకాయిలను ఇస్తలేదు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీకి సర్కారు చెల్లించాల్సిన ఆస్తి పన్నుల బకాయిలను ఇవ్వడం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయించిన నిధులనూ విడుదల చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు బడ్జెట్ లో రూ.10 వేల 874.23 కోట్లు కేటాయించగా, ఇందులో 3 శాతం మాత్రమే నిధులను జీహెచ్ఎంసీకి ఇచ్చింది. నిధులు లేక జీహెచ్ఎంసీ  ఏ పనులు చేయలేకపోతోంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న కూడా నిధుల కొరత అడ్డుగా మారింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ చేసిన అప్పుల కంటే సర్కారు బకాయిలే ఎక్కువగా ఉన్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.5,564 కోట్ల బకాయిలు చెల్లిస్తే జీహెచ్ఎంసీ గట్టెక్కుతుంది.  ఈ బకాయిలు గనుక చెల్లిస్తే జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు చేసిన  అప్పులన్ని తిరిగి చెల్లించవచ్చు. బల్దియా చేసిన అప్పులకు  డైలీ రూ. కోటి 20 లక్షల వడ్డీ చెల్లిస్తోంది. ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తే వడ్డీ కూడా మిగిలిపోతుంది. ఎంప్లాయీస్​కు టైమ్​కు జీతాలు అందండంతో పాటు బల్దియానే మరొకరికి అప్పులు ఇచ్చే స్థాయికి చేరుతుంది. ఎంసీహెచ్(మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్)గా ఉన్నప్పుడు, 2007లో జీహెచ్ఎంసీగా మారిన తర్వాతా ఎన్నడూ ఇంత ఘోరమైన పరిస్థితులను బల్దియా  ఎదుర్కొలేదు.  రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీని పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది. సిటిజన్ల దగ్గరి నుంచి బల్దియాలో పనిచేసే ఎంప్లాయీస్, శానిటేషన్ కార్మికుల వరకు  జీహెచ్ఎంసీపై రాష్ట్ర ప్రభుత్వం  వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సినవి ఇవీ....

బల్దియాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,564 కోట్ల ఆస్తి పన్నుల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇందులో కొన్ని ప్రభుత్వ శాఖలు ఏడాది నుంచి 25 ఏండ్లుగా పన్నులను చెల్లించడం లేదు. రాష్ట్ర సర్కారుకు  అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆబ్కారీ శాఖ భవనాల పన్నును చెల్లించడం లేదు. ఒక్క ఆబ్కారీ శాఖ నుంచే 21 ఏండ్లకు సంబంధించిన ఆస్తి పన్ను రూ.895 కోట్ల బకాయి రావాల్సి ఉంది. అలాగే వైద్య శాఖ నుంచి 23 ఏండ్లకు సంబంధించిన పన్ను రూ.1,185కోట్లు, పోలీసు శాఖ 11 ఏండ్లకు గాను రూ.420 కోట్లు చెల్లించాల్సి ఉంది. విద్యా శాఖకు సంబంధించి 16 ఏండ్లుగా రూ.385 కోట్ల ఆస్తి పన్ను​బకాయి పడింది. ఇలా మరెన్నో ప్రభుత్వ ఆస్తులకి సంబంధించి రూ.5,258 కోట్లు, ప్రభుత్వం రంగ సంస్థలకి సంబంధించి రూ.306 కోట్లు బల్దియాకు చెల్లించాల్సి ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో కొన్ని పన్నులు చెల్లించినప్పటికీ సొంత రాష్ట్రంలో నయా పైసా రావడం లేదని అధికారులు చెబుతున్నారు. 

బడ్జెట్ కేటాయింపులు ఇలా..

పేరుకు బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ బల్దియాకు సర్కారు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదు. 2014–15 బడ్జెట్​లో జీహెచ్ఎంసీకి రూ.375.93 కోట్లు కేటాయించిన సర్కారు​.. రూ.288.14 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2015–16లో రూ.428 కోట్లు కేటాయించి.. కేవలం రూ.23 కోట్లతోనే సరిపెట్టింది. 2016–17లో రూ.70.30 కోట్లు కేటాయించి.. రూ.1.32 కోట్లే ఇచ్చింది. 2017–18 బడ్జెట్​లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28 కోట్లు కేటాయించినా నయా పైసా కూడా విడుదల చేయలేదు. 2018–19, 2019–20 బడ్జెట్​లో అసలు నిధులే కేటాయించలేదు. 2020–21 బడ్జెట్​లో నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం అందులో జీహెచ్ఎంసీకి  కేవలం రూ.17 కోట్లు మాత్రమే అందించింది. 2021–22 లోనూ నిధులను కేటాయించలేదు. 2022–23 లో కూడా రూ.2,500 కోట్ల నిధులు కావాలంటూ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ  లెటర్ రాసింది. కానీ ఈ నిధులు  రాలేదు. 

బల్దియా అప్పులు....

 జీహెచ్ఎంసీ ఇప్పటికే ఎస్ఆర్​డీపీ కోసం ఎస్​బీఐలో 8.65 శాతం వడ్డీ కింద రూ.2500 కోట్లు , కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) కోసం 7.20 శాతం వడ్డీతో రూ.1,460 కోట్లు, మళ్లీ ఎస్​ఆర్​డీపీ పనుల కోసం బాండ్ల ద్వారా 490 కోట్లు తీసుకుంది. ఈ 490 కోట్లలో ఇందులో రూ.200 కోట్లకు 8.90 శాతం, 190 కోట్లకు 9.38శాతం, రూ.100 కోట్లకు 10.23 శాతం వడ్డీ చెల్లిస్తోంది. రూ.140 కోట్లను హడ్కో ద్వారా  వాంబే హౌసింగ్ స్కీమ్ కోసం తీసుకుంది. ఇందులో రూ.100 కోట్లకు 10.15 శాతం, రూ.40 కోట్లకు 9.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. వీటితో పాటు గతేడాది ఆగస్టు తర్వాత నాలాల పనుల కోసం రూ.685 కోట్ల అప్పు తీసుకుంది. మొత్తం అన్ని కలిపితే రూ.5,275 కోట్ల అప్పు ఇప్పటికే ఉంది. ఇందుకు సంబంధించి ఏడాదికి రూ.400 కోట్లకుపైగా వడ్డీ చెల్లిస్తుంది. ఇప్పుడు మళ్లీ రూ.500 కోట్ల అప్పు కోసం ఎదురుచూస్తోంది.

ఫండ్స్​ లేకపోవడంతో ఇప్పటికే గ్రేటర్​లో ఎన్నో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు చేసిన పనులకు ఇవ్వాల్సిన రూ. వెయ్యి కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో కొంతకాలంగా వారు సమ్మె చేస్తున్నారు. దీంతో నెలరోజులుగా మెయింటెనెన్స్​పనులు  పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలకు రోడ్లు డ్యామేజ్ అయినా కనీసం పాట్ హోల్స్​ను పూడ్చేవారు కూడా లేరు. బాక్స్ డ్రెయిన్ల పనులు, ఫుట్ పాత్​ల నిర్మాణం, నాలాల పూడికతీత తదితర వర్క్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో వర్షాలు పడితే జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. గ్రేటర్​లో డబుల్ బెడ్రూం ఇండ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోవడంతో వాటి నిర్మాణం కూడా స్లోగా జరుగుతోంది.  స్ఆర్​డీపీ(స్ట్రాటజిక్ రోడ్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్) ఫేజ్–2కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపినా కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. ఫస్ట్ ఫేజ్​లో 47 పనులు చేపట్టగా..  అందులో ఇంకా 15 పనులు కొనసాగుతున్నాయి. అయితే సెకండ్ ఫేజ్​కు రూ.3,150 కోట్ల అవసరముంది. అందుకే  ఈ పనులను కొన్నాళ్ల పాటు ఆపినట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం నాలాల నిర్మాణ పనులపై కూడా పడనుంది. ఎస్ఎన్ డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్​ మెంట్ ప్రోగ్రామ్)కు నిధుల కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు అందట్లేదు. ఫస్ట్ ఫేజ్ పనులు స్లోగా జరుగుతుండగా, నిధులు లేక సెకండ్ ఫేజ్ నాలాల పనులు మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇలా పార్కుల మెయింటెనెన్స్​, ఎంప్లాయీస్, కార్మికుల వేతనాలు ఇలా జీహెచ్ఎంసీ చేపట్టే అన్ని పనులపై నిధుల ప్రభావం తీవ్ర స్థాయిలో చూపుతోంది. చివరకు చెత్త ఎత్తడంపై కూడా ఈ ప్రభావం పడుతోంది.

నిధులు లేనప్పుడు పనులు ఎందుకు మొదలుపెడ్తున్నరు?

దేశంలో ఏ సిటీలోనూ ఇంత దారుణమైన పరిస్థితులు ఉండవు. జీహెచ్ఎంసీకి ఫండ్స్​ ఇవ్వనందుకు రాష్ట్ర సర్కారుకు అవార్డు ఇవ్వాలి.  ఫండ్స్ లేకుండా పనులు ఎలా చేస్తరు? నిధులు లేనప్పుడు అధికారులు పనులను ఎందుకు మొదలుపెడ్తున్నరు. పైసలుంటనే పనులు చేయాలి. టెండర్లు వేసి పనులను మధ్యలో నిలిపి వేయడమెందుకు? చేసిన పనులకు 8 నెలలు అయినా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదు.  ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఏ చిన్న పని చేసేందుకు కూడా బల్దియా దగ్గర నిధులు లేవంటే ఇదెక్కడి అన్యాయం. 

–  అబ్దుల్ రెహమాన్, సోషల్ యాక్టివిస్ట్