రెండో రోజు 57 మంది నామినేషన్

రెండో రోజు 57 మంది నామినేషన్
  • ఈ నెల 25న ముగియనున్న గడువు 
  • మహబూబ్​నగర్​ నుంచి వంశీచంద్​రెడ్డి.. సికింద్రాబాద్​ నుంచి కిషన్​రెడ్డి..  
  • పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ నామినేషన్లు​ దాఖలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండో రోజు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 17 లోక్​సభ స్థానాలకు శుక్రవారం 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి మహబూబ్​నగర్ నుంచి, గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి నుంచి, ఆత్రం సుగుణ ఆదిలాబాద్ స్థానానికి,  పొరిక బలరాం నాయక్​ మహబూబాబాద్​లో నామినేషన్లు వేశారు. సికింద్రాబాద్ లోక్​సభ స్థానానికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ నామినేషన్లు సమర్పించారు.

బీజేపీ నుంచి నిజామాబాద్​ సీటుకు ధర్మపురి అర్వింద్, ఖమ్మం స్థానానికి తాండ్ర వినోద్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. అర్వింద్ మెడలో పసుపు కొమ్ము దండ వేసుకుని, పసుపు రైతులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. కరీంనగర్ స్థానానికి బండి సంజయ్ తరఫున బీజేపీ లీడర్‌‌ బండ రమణారెడ్డి నామినేషన్‌‌ దాఖలు చేశారు. ఇక హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ దాఖలు చేశారు. 

తన కొడుకు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి చార్మినార్ నుంచి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. కాగా, రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభం కాగా, నామినేషన్ల దాఖలుకు గడువు ఈ నెల 25తో ముగియనుంది. మొదటి రోజున 42 మంది అభ్యర్థులు నామినేషన్​వేశారు. రెండో రోజున నామినేషన్లు వేసిన వారిలో 25 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నట్టు ఈసీ ప్రకటించింది.  

మాధవీలతపై చర్యలెందుకు తీస్కోవట్లే?: అసదుద్దీన్  

హైదరాబాద్​లో గత 15 ఏండ్లుగా శాంతి నెలకొందని, ఇప్పుడు దానికి భంగం కలిగించేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. లోక్ సభ ఎంపీగా నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. శ్రీరామనవమి సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మత విశ్వాసాలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని అన్నారు. ర్యాలీలో ఓ ప్రార్థన మందిరంవైపు బాణం సంధించినట్లు ఫోజు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై పోలీస్ కమిషనర్, ఎలక్షన్ కమిషన్, చీఫ్​ఎలక్టోరల్ ఆఫీసర్, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. అదే తమపై అయితే మాత్రం  సుమోటోగా చర్యలు తీసుకునేవారని ఆరోపించారు.