
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖకు ఆదివారం నాటికి దాదాపు 5.83 కోట్ల పన్ను రిటర్న్‌లు వచ్చాయని సంబంధిత ఆఫీసర్లు సోమవారం తెలిపారు. ఈ నెంబర్ పోయిన ఆర్థిక సంవత్సరం (2020–-21) మాదిరిగానే ఉన్నాయి. 2022 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి తమ ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వాళ్లు, ఇండివిడ్యువల్ కేటగిరీ పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి గడువు తేదీ జులై 31 (ఆదివారం)తో ముగిసింది. చివరిరోజు నాటికి దాదాపు 5.83 కోట్ల రిటర్న్‌లు వచ్చాయని, కచ్చితమైన లెక్కలను చెప్పేందుకు డేటాను సరిదిద్దుతున్నామని సీనియర్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.
ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ
కరోనా ఎఫెక్ట్ వల్ల పోయిన ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీని డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. అప్పుడు 5.89 కోట్ల ఐటీఆర్‌లు వచ్చాయి. ఈసారి చివరి రోజు (ఆదివారం) 72 లక్షలకు పైగా ఐటీఆర్‌లు అందాయి. తాజా రూల్స్ ప్రకారం, 2022–-23 అసెస్మెంట్ సంవత్సరంలో ఆలస్యంగా.. అంటే డిసెంబర్ 31లోపు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేసిన వారు (రూ. 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారు) రూ. 5,000 లేట్ ఫీజు చెల్లించాలి. ఏడాది ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యక్తులు లేటుగా ఐటీఆర్ వేస్తే రూ.వెయ్యి ఫైన్‌గా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను బాకీ ఉన్నవారు ఆలస్యంగా దాఖలు చేసినందుకు నెలకు అదనంగా 1 శాతం వడ్డీని చెల్లించాలని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి.