
న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో హుమాయున్ టాంబ్ (సమాధి) సమీపంలో ఉన్న ఓ దర్గా పైకప్పు కూలిపోయి ఆరుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల కోసం హుమాయున్ టాంబ్ వద్ద ఉన్న షరీఫ్ పత్తే షా దర్గాకు భక్తులు వచ్చిన సందర్భంగా అక్కడి పాత భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో శిథిలాలు మీద పడి ఆరుగురు చనిపోయారు. గాయపడినవారిని ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్ కు చికిత్స కోసం తరలించామని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 80 ఏండ్ల వృద్ధుడు కూడా ఉన్నట్టు తెలిపారు.
ప్రమాద సమయంలో దర్గా వద్ద ఇమామ్ తో సహా 15 నుంచి 20 మంది ఉన్నారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే భద్రత బలగాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు. పైకప్పు కూలిన బిల్డింగ్ 25 నుంచి 30 ఏండ్ల నాటిదని, ఇటీవలి వర్షాల వల్ల కూలిపోయి ఉంటుందని తెలిపారు. కాగా, 16వ శతాబ్దంలో నిర్మితమైన మొగల్ రాజు హుమాయూన్ సమాధి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిపు పొందింది. ప్రస్తుతం కూలిన భవనంతో సమాధికి ఎటువంటి నష్టం జరగలేదని ఆగా ఖాన్ ట్రస్ట్ వెల్లడించింది. హుమాయున్ టూంబ్ ప్రధాన డోమ్ కూలిందన్న ప్రచారం నిజం కాదని పేర్కొంది.