ప్రతినెలా అప్పుల కిస్తీలకే 6 వేల కోట్లు

ప్రతినెలా అప్పుల కిస్తీలకే 6 వేల కోట్లు
  • సర్కారును వెంటాడుతున్న పాత అప్పుల భారం 
  • రోజుకు యావరేజ్​గా రూ.207 కోట్ల చెల్లింపులు
  • ఈ నాలుగు నెలల్లో కొత్తగా రూ.17,618 కోట్ల అప్పు 
  • గత సర్కార్​ అప్పులకు వడ్డీలు, కిస్తీలకు 25,911 కోట్లు చెల్లింపు
  • ఇతర స్కీముల కోసం నిధుల సర్దుబాటుకు తప్పని తిప్పలు

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్ర ఆదాయంలో సింహభాగం అప్పులు, జీతాల చెల్లింపులకే పోతున్నది.  గత ప్రభుత్వం చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీలకే యావరేజ్​గా రోజుకు రూ.207 కోట్లు చెల్లిస్తున్నారు. దీంతో స్కీములకు, ఇతరత్రా వాటికి  నిధుల సర్దుబాటుకు ప్రస్తుత సర్కార్​ తిప్పలు పడుతోంది. 

కొత్త అప్పులు ఇష్టారీతిన చేయొద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ.. గతంలో చేసిన వాటి చెల్లింపుల కోసం మళ్లీ అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోందని ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రతినెలా కిస్తీలు, వడ్డీలకే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలపైనే చెల్లిస్తున్నట్టు పేర్కొంటున్నారు. తీసుకుంటున్న అప్పుల కంటే కడుతున్నవే ఎక్కువగా ఉండటం గమనార్హం. 

కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి తీసుకున్న అప్పులు, కట్టిన కిస్తీల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు.. అంటే డిసెంబర్ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్, బడ్జెటేతర రుణాలన్నీ కలిపి రూ.17,618 కోట్ల అప్పులు చేసింది. ఇదే వ్యవధిలో గడిచిన పదేండ్లలో చేసిన అప్పులకు రూ.25,911 కోట్ల  రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి కిస్తీలు) చేసింది. గడిచిన పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పు  చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలే తడిసి మోపెడవుతున్నాయి. 

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో తెచ్చిన కొత్త అప్పులు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు చెల్లించేందుకు సరిపోలేదు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నాలుగు నెలల్లో రూ.15,968 కోట్ల అప్పు తీసుకుంది. 2022–23 సంవత్సరం ఇదే వ్యవధిలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ.19,569 కోట్లు, 2021–22లో రూ.26,995 కోట్ల అప్పు పొందింది. 

వాస్తవానికి 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్​లో రూ. 59,625 కోట్ల రుణాలను ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటివరకు కేవలం రూ.2,500 కోట్లు అప్పుగా తీసుకుంది.  గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్​డీపీ) పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్​డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ కిస్తీలు చెల్లించింది. అప్పుల భారం ప్రజలపై మోపడం కంటే.. కాస్త ఆచితూచి ముందుకు వెళితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. 

గాడిన పెట్టేందుకు ఇష్టారీతి అప్పులకు 'నో'

గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కలిపి తిరిగి చెల్లించేందుకు 125 రోజుల్లో ప్రభుత్వం సగటున ఒక రోజుకు రూ.207 కోట్లు ఖర్చు చేసింది. ప్రజోపయోగమైన నిర్మాణాలకు, పనులకు మరో  5,816 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేసింది.  ఈ 4 నెలల్లో  గత ప్రభుత్వం చేసినట్లుగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటించింది.  పదేండ్లలో వందేండ్ల విధ్వంసం జరిగినట్టు ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. కార్పొరేషన్​ అప్పులపై నియంత్రణను పాటిస్తున్నారు. ఆర్బీఐ నుంచి ఎక్కువ అప్పులు తీసుకునే చాన్స్​ ఉన్నప్పటికీ అవసరాల మేరకే పొందుతున్నారు.

ఒకటో తేదీ వస్తే రూ.11 వేల కోట్లు కావాలె

ప్రతినెలా ఒకటో తేదీ వస్తే చాలు.. ప్రభుత్వ ఖజానాలో రూ.11 వేల కోట్లు కచ్చితంగా ఉండాల్సిందే. ఇందులో నుంచే జీతాలు, పెన్షన్ల చెల్లింపులకు రూ.4,600 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కిస్తీలు, వడ్డీల చెల్లింపుల కోసం దాదాపు రూ.5,500 కోట్లు చెల్లించాలి. ఇతర కొన్ని అత్యవసర ఖర్చులకు వెయ్యి కోట్ల మేర అవసరం ఉంటుంది. ఇవి మినహాయించాకే ప్రభుత్వ పథకాలు, క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం పెండింగ్​లో పెట్టిన రూ.40 వేల కోట్ల బిల్లులను కూడా కొంత మొత్తం చొప్పున క్లియర్​ చేయాలి. అయితే, ప్రభుత్వానికి సమకూరుతున్న​అప్పులు కాకుండా వస్తున్న ఆదాయం చూస్తే  రూ.12 వేల కోట్ల దాకా ఉంటోంది. ఇవన్నీ పోను స్కీముల కోసం ఖర్చు చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 5 ఎకరాల పైన రైతుబంధు సాయం కూడా ఈ కారణంతోనే ఆలస్యం అవుతున్నది.