
- వీధుల్లో కుక్కల స్వైరవిహారం
- 19 నెలల్లో 16,612 మందికి కుక్కకాటు
- యాదాద్రిలో 30 వేల కుక్కలు
- మధ్యలోనే నిలిచిన జనన నియంత్రణ
యాదాద్రి, వెలుగు : జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనుష్యులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెంచిన యజమానినే గాయపరిచిన సంఘటనలూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలతో కుక్కలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
16,612 మందికి కుక్క కాటు..
యాదాద్రి జిల్లాలో కుక్కల దాడిలో గాయపడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వాటి దాడిలో గాయపడి ప్రభుత్వ హాస్పిటల్లో వేలాది మంది ట్రీట్మెంట్పొందారు. హెల్త్ డిపార్ట్మెంట్లెక్కల ప్రకారం 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు 16,624 మంది గాయపడ్డారు. ఇందులో 2024 జనవరి నుంచి డిసెంబర్వరకు 8,241 మందిని కుక్కలు కరవగా, ట్రీట్మెంట్ఇప్పించుకున్నారు. జనవరి 2025 నుంచి జూలై వరకు ఎనిమిది నెలల్లోనే 8,371 మందిని కుక్కలు కరిచాయి. వీరిలో ఎవరూ కూడా చనిపోలేదని హెల్త్ డిపార్ట్మెంట్చెబుతోంది. అయితే ప్రైవేట్హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకున్నవారి లెక్కలు లేవు.
కుక్క కాటుతో రేబిస్..
కుక్క కాటు వల్ల రేబిస్వ్యాధి సంక్రమిస్తోంది. కొన్ని సందర్భాల్లో వాటి లాలాజలం ద్వారా కూడా ఈ వ్యాధి వస్తోంది. ఈ వ్యాధి లక్షణాలు ఒకటి నుంచి మూడు నెలల వరకు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాధి తీవ్రత పెరుగుతున్నా కొద్దీ మనిషి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కన్పిస్తాయి. సకాలంలో డాక్టర్ను సంప్రదించడం ద్వారా టీకాల ద్వారా రేబిస్నుంచి బయటపడవచ్చు.
యాదాద్రిలో కుక్కలు 30 వేలు..
గతేడాదిలో జరిగిన కుక్క కాటు ఘటనల కారణంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ స్టాఫ్ రంగంలోకి దిగి సర్వే నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 30 వేల కుక్కలు ఉన్నట్టు 2024 జూలైలో తేల్చారు. వీటిలో 421(ఇప్పుడు 427) గ్రామ పంచాయతీల్లో 27025 కుక్కలు ఉన్నాయి. నారాయణపురం మండలంలోని సర్వేల్లో 400 కుక్కలకుపైగా ఉన్నాయి.
తర్వాత స్థానంలో అదే మండలంలోని పుట్టపాకలో 300కు పైగా ఉన్నాయి. అతి తక్కువగా వలిగొండ మండలం నర్సిగూడెంలో 10లోపే ఉన్నాయని సర్వేలో తేల్చారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో వెయ్యికి పైగా కుక్కలు ఉండగా, మిగిలిన ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఒక్కో చోట 400 కు పైగా కుక్కలు ఉన్నాయని తేల్చారు.
మధ్యలోనే ఆగిన జనన నియంత్రణ..
కుక్కల దాడులను సీరియస్గా తీసుకున్న హైకోర్టు వాటికి జనన నియంత్రణ చేయించాలని గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలతో సర్వే నిర్వహించిన అనంతరం కుక్కల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం జిల్లా కేంద్రమైన భువనగిరి శివారులో ఏబీసీ (యానిమల్బర్త్కంట్రోల్) సెంటర్ ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కుక్కల కు.ని బాధ్యతను అప్పగించారు. ఒక్కో కుక్కకు రూ.1600 చొప్పున చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కొన్ని కుక్కలకు జనన నియంత్రణ చేయించినా.. బిల్లులు సకాలంలో చెల్లించలేదు. దీంతో సదరు ఏజెన్సీ పక్కకు తప్పుకుంది. దీంతో జనన నియంత్రణ మధ్యలోనే ఆగిపోయింది.
ఒక వ్యక్తి బస్సు కోసం బస్టాండ్లో వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచో వచ్చిన కుక్క.. అతడి పిక్క పట్టుకొని కొరికేసింది. చుట్టుపక్కల వారు బెదిరించడంతో కుక్క పారిపోయింది. సదరు వ్యక్తి ట్రీట్మెంట్కోసం ఓ ప్రైవేట్హాస్పిటల్కు వెళ్లాడు.
ఇంటి యజమానికి పెంపుడు కుక్క కరిచింది. పెంపుడు కుక్కే కదా అని సీరియస్గా తీసుకోలేదు. కాలం గడుస్తున్నా కొద్ది.. ఇంటి యజమానురాలి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను కట్టి వేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ట్రీట్మెంట్ఇప్పించినా రేబిస్తగ్గలేదు. కొన్ని నెలల తర్వాత ఆమె మరణించింది.
ఈ ఏడాదిలో కుక్కకాటుకు గురైన వారి సంఖ్య
జనవరి 1284
ఫిబ్రవరి 1203
మార్చి 1271
ఏప్రిల్ 1167
మే 1145
జూన్ 1128
జూలై 1173