
వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క ఇల్లు పూర్తి కాలే
ఆసిఫాబాద్ జిల్లాలో 10 మాత్రమే పూర్తి
స్టార్ట్కాని ఇండ్లను రద్దు చేసే యోచనలో కొత్త సర్కారు
వాటి ప్లేస్ లో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టని డబుల్ బెడ్రూం ఇండ్లను కొత్త ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబం ధించి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62,602 ఇండ్ల పనులు అసలు స్టార్ట్ కాలేదని హౌసింగ్ అధికారుల లెక్కలు చెప్తున్నాయి. అయితే, వీటి ప్లేస్‌లో ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల స్టేటస్‌పై హౌసింగ్ అధికారులు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇటీవల సమగ్ర నివేదిక అందజేశారు. మొత్తం ఎన్ని శాంక్షన్ అయ్యాయి? ఎన్ని ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి? ఎన్ని పూర్తయ్యాయి? చివరి దశకు చేరుకున్నవి ఎన్ని? చేసిన ఖర్చు ఎంత? తదితర వివరాలు ఇందులో ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.
చివరి దశకు చేరుకున్న పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. 2015లో డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్ స్టార్ట్ అయింది. అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,92,938 ఇండ్లు శాంక్షన్ చేసింది. అందులో ఈ నెల 1 వరకు 1,50,407 ఇండ్లు పూర్తయ్యాయి. 45,050 ఇండ్లు చివరి దశ కు (85%) చేరుకున్నాయి. 34,879 ఇండ్ల పనులు ఇంకా జరుగుతున్నాయని అధికారులు నివేదికలో స్పష్టం చేశారు. ఇప్పటి దాకా డబుల్ బెడ్రూం ఇం డ్లకు రూ.12,298.17 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణం పూర్తయినా.. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవటంతో అన్ని జిల్లాల్లో రెండుమూడేండ్లు ఖాళీగా ఉంచి.. ఎన్నికల ముందు ప్రభుత్వం హడావుడిగా 80 వేల ఇండ్లను అందజేసింది.
రెండు జిల్లాల్లో ఒక్క ఇల్లు పూర్తికాలే
రాష్ట్రంలో నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు పూర్తి కాలేదు. నారాయణపేట జిల్లాకు 2,090 ఇండ్లు శాంక్షన్ కాగా.. 864 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 1,190 ఇండ్ల పనులు అసలు స్టార్ట్ కాలేదు. వికారాబాద్ జిల్లాకు 4,036 ఇండ్లు శాంక్షన్ కాగా.. 1,219 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 1,759 ఇండ్ల పనులు స్టార్ట్ కాలేదు. నాగర్‌కర్నూలు జిల్లాలో 390 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాకు 1,239 ఇండ్లు శాంక్షన్ కాగా.. 664 ఇండ్ల పనులు స్టార్ట్ కాలేదు. ఇక ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎక్కువ శాతం ఇండ్ల నిర్మాణం స్టార్ట్ కాలేదు.
గృహలక్ష్మిని రద్దు చేసి.. ఇందిరమ్మ ఇండ్లు
సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలతో గృహలక్ష్మి స్కీమ్ ను గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు తీసుకొని సుమారు 2 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే, కొత్త ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ స్టార్ట్ కావటంతో గృహలక్ష్మి స్కీమ్ ను రద్దు చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.