6.6 కోట్ల ఏండ్ల నత్తగుల్లలు

6.6 కోట్ల ఏండ్ల నత్తగుల్లలు

హైదరాబాద్, వెలుగు: 6.6 కోట్ల ఏండ్ల నాటి నత్తగుల్లలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో బయపడ్డాయి. బోరిలాల్ గూడ శివారు పొలాల్లో ఈ ప్రాచీన శిలాజాల జాడను కొత్తతెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, బీ.వీ.భద్ర గిరీశ్, ఎస్. వేణుగోపాలాచార్యులు, కెరమెరి స్థానికుడు తిరుగీతె కనుగొన్నారు. ఈ శిలాజాలను పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు మాట్లాడుతూ ఇవి 6.6 కోట్ల ఏండ్లకు పూర్వం అప్పర్  క్రిటేషియస్ యుగానికి చెందినవని చెప్పారు. ఈ శిలాజాల్లో అనేక జాతులకు చెందిన నత్తలు ఉన్నాయన్నారు. ఫైజా ప్రిన్సిపి, ఫైజా తేర్పోలెన్సిస్ (సంగారెడ్డి జిల్లా తేర్పోలులో దొరికిన నత్తల శిలాజాలు), ఇంకా గుర్తించని సూక్ష్మశంకులు, ఆల్చిప్పలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతం నాగపూర్, ఆసిఫాబాద్ మధ్య ఉన్నదని, ఇక్కడ భూవైజ్ఞానిక పరిశోధనలు చేయాల్సి ఉందని ఆయన సూచించారు.