
రాయ్పూర్: ఆపరేషన్ కగార్తో కోలుకోలేని దెబ్బ తిన్న మావోయిస్టు పార్టీకి.. మరో భారీ షాక్ తగిలింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 66 మంది మావోయిస్టులు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. గురువారం (జూలై 24) ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్‌లోని ఐదు జిల్లా నుంచి మొత్తం 66 మంది నక్సలైట్లు భద్రతా దళాల ముందు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు. బీజాపూర్ నుంచి 25 మంది, దంతెవాడ నుంచి 15, కాంకేర్ నుంచి 13, నారాయణపూర్ నుంచి 8, సుక్మా నుంచి ఐదుగురు సరెండర్ అయ్యారని తెలిపారు.
ఇందులో 27 మంది మహిళా మావోస్టులు ఉన్నారని చెప్పారు. సరెండర్ అయిన వారిలో 49 మంది రూ.2.27 కోట్ల రివార్డ్ అందుకున్నారని తెలిపారు. మావోయిస్టు భావజాలం పట్ల పెరుగుతున్న నిరాశ, పార్టీలో అంతర్గత చీలికలు, అమాయక గిరిజనులపై మావోయిస్టుల దురాగతాలకు వ్యతిరేకంగా వీరంతా లొంగిపోయారని పోలీసులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో కొందరు కీలక నేతలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
మావోయిస్ట్ పార్టీ ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు రామన్న ఇర్పా (37).. అతని భార్య, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు రామే కల్ము (30), మావోయిస్టుల నార్త్ బ్యూరో టెక్నికల్ టీమ్ ఇన్‌ఛార్జ్ వట్టి గంగా అలియాస్ ముఖేష్ (44), డివిజనల్ కమిటీ సభ్యుడు బుధ్రామ్ అలియాస్ లాలు కుహ్రామ్, అతని భార్య కమ్లి అలియాస్ మోతి పొటావి లొంగిపోయారని తెలిపారు. మావోయిస్ట్ పార్టీలో కీలకంగా పని చేసిన సుక్కు కల్ము (38), బబ్లూ మాద్వి (30), కోసి మద్కం (28), రీనా వంజం (28) కూడా సరెండర్ అయ్యారని పేర్కొన్నారు.
ALSO READ | RSS చీఫ్ మోహన్ భగవత్ శాంతి ప్రేమికుడు..ముస్లిం మత పెద్దల ప్రశంసలు
కాగా, 2026 మార్చి 31 లోపు దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రంలోని మోడీ సర్కార్ శపథం చేసిన విషయం తెలిసిందే. ఇందుకోసం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో భద్రతా దళాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య పలుమార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మరణించారు. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, సుధాకర్, భాస్కర్ వంటి కీలక నేతలతో సహా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.