ఇరాన్, పాక్‌లో భూకంపం.. ఏడుగురు మృతి

ఇరాన్, పాక్‌లో భూకంపం.. ఏడుగురు మృతి

ఇరాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌ లో భూమి కంపించింది. ఇరాన్‌ - తుర్కియే సరిహద్దులో 5.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని కోయ్‌ నగరంలో ఏడుగురు మరణించగా.. 440 మంది గాయపడ్డారు. పెద్దసంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు విరిగి పడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా.. తప్పించుకునే ప్రయత్నంలో భవనాలపై నుంచి దూకి ఎక్కువమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. అయితే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. 

ఇక పాకిస్తాన్ లోని పంజాబ్ లో 6.3 తీవ్రతతో అటక్‌ నగర సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. తజికిస్థాన్‌ వద్ద 150 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పాక్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని.. ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ సమాచారం ఏదీ లేదని రేడియో పాకిస్థాన్‌ తెలిపింది. భూకంపాలకు అనుకూల ప్రాంతమైన పాకిస్థాన్‌లో 2005లో వచ్చిన భారీ భూకంపం 74,000 మందికి పైగా ప్రజల ప్రాణాలను బలిగొంది.