
- 2024లో 6.8 వరకు గ్రోత్
- అన్ని రంగాలూ పుంజుకుంటాయ్
- క్రెడిట్‌గ్రోత్ బాగుంటుంది
- వెల్లడించిన ఎకనమిక్ సర్వే
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో మనదేశ ఆర్థిక వ్యవస్థ కరోనా కష్టాల నుంచి పూర్తిగా గట్టెక్కుతుందని, అన్ని రంగాలూ పుంజుకుంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పుల వల్ల మన ఆర్థిక వ్యవస్థ 2030 వరకు ఏటా 6.5–7 శాతం గ్రోత్సాధించే అవకాశం ఉందని చీఫ్ ఎకనమిస్ట్ అనంత నాగేశ్వరన్ అన్నారు. కార్పొరేట్ కంపెనీల బ్యాలన్స్షీట్స్బలంగా ఉండటం, ఫైనాన్స్సెక్టర్మరింత బాగుపడటం వల్ల మరింత గ్రోత్‌కు అవకాశాలు ఉన్నాయని వివరించారు. గ్లోబల్మార్కెట్లో ఆటుపోట్లు ఇండియాకు మేలే చేస్తాయని, చమురు, కమోడిటీ ధరల వల్ల మాత్రం ఇబ్బందులు ఉంటాయని నాగేశ్వరన్ పేర్కొన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్ఏడుశాతం ఉంటుందని, ‘అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీ’ గుర్తింపు కొనసాగుతుందని సర్వే స్పష్టం చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ గ్రోత్ 6--–6.8 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. డాలర్ విలువ పెరుగుదల వల్ల ద్రవ్యలోటు మరింత ఎక్కువ కావొచ్చని అంచనా వేసింది.
జీడీపీ గ్రోత్
- ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుంది. కరోనా, రష్యన్–-ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యల నుంచి కోలుకుంటాం.
- భారతదేశ జీడీపీ వృద్ధి 2023 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం (రియల్టర్మ్స్) వద్ద పటిష్టంగా ఉంటుంది. పోయిన ఆర్థిక సంవత్సరంలో ఇది 8.7 శాతం వృద్ధిని సాధించింది. 2024 ఆర్థిక సంవత్సరం జీడీపీ గ్రోత్ 6-–6.8 శాతం వరకు ఉంటుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో బేస్‌లైన్ జీడీపీ (నామినల్ టర్మ్స్) గ్రోత్ 11 శాతం, రియల్టర్మ్స్ లో గ్రోత్ 6.5 శాతం ఉండొచ్చని భావిస్తున్నారు.
- రాబోయే సంవత్సరంలో వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. భారీ డిమాండ్, మూలధన పెట్టుబడిలో పెరుగుదల ఇందుకు సాయపడతాయి. ప్రభుత్వం కూడా మూలధన వ్యయాన్ని (క్యాపెక్స్‌ను) గణనీయంగా పెంచింది. పీపీపీ (కొనుగోలు శక్తి సమానత్వం) టర్మ్స్‌లో ఇండియా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, ఎక్స్ఛేంజ్ రేటు పరంగా ఐదవ అతిపెద్దది.
- 2023 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం 58.5 శాతంగా ఉంది. ఇది 2015 ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని సంవత్సరాల రెండో క్వార్టర్లలో ఇదే అత్యధికం. ట్రేడ్, హోటల్ రవాణా వంటి సెగ్మెంట్లు పుంజుకోవడం ఇందుకు కారణం.
- ప్రైవేట్ ఎక్స్పెండిచర్, భారీ క్యాపెక్స్, కార్పొరేట్లు బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడం, చిన్న వ్యాపారాలకు లోన్లు పెరగడం, వలస కార్మికులు నగరాలకు తిరిగి రావడం వల్ల మరింత గ్రోత్ సాధ్యమవుతుంది. ఆర్థిక వ్యవస్థ కరోనా వల్ల నష్టపోయిన వాటిని దాదాపుగా తిరిగి పొందింది. కేంద్ర ప్రభుత్వ క్యాపెక్స్పెరగడం, కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేట్ క్యాపెక్స్ అధికమయింది. ప్రస్తుత సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థను ఇవన్నీ ముందుకు తీసుకువెళ్తాయి.
- రిటైల్ ఇన్ఫ్లేషన్ పోయిన ఏడాది ఏప్రిల్‌లో 7.8 శాతం రికార్డయింది. ఇది ఆర్బీఐ పెట్టుకున్న లిమిట్ఆరు శాతం కంటే ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వరకు ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా. దీనివల్ల వడ్డీరేట్లు పెరుగుతాయి. ప్రస్తుతం ఇది కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ. ధనిక దేశాల్లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది.
లోన్లు పెరిగినయ్..
ఆర్బీఐ ఏప్రిల్ 2022లో మానిటరీ పాలసీని మరింత కఠినతరం చేసింది. అప్పటి నుంచి రెపో రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచింది. మార్కెట్లోకి మరింత డబ్బు వచ్చింది. క్లీనర్ బ్యాలెన్స్ షీట్ల వల్ల కంపెనీలు భారీగా లోన్లు ఇచ్చాయి. 2022 ఏప్రిల్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు (ఎస్సీబీలు) ఆహారేతర క్రెడిట్ ఆఫ్‌టేక్ రెండంకెలలో పెరుగుతోంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బిఎఫ్‌సిలు) లోన్లు కూడా పెరుగుతున్నాయి. గ్రాస్ ఎన్పీఏల నిష్పత్తి ఏడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. క్యాపిటల్ -టు- రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) 16 శాతం వద్ద ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో దివాలా కోడ్ ద్వారా ఎస్సీబీల రికవరీ రేటు అత్యధికంగా ఉంది. జూలై 2021 నుంచి 18 నెలల పాటు పీఎంఐ పెరుగుతోంది. ఇండస్ట్రియల్ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) దూసుకెళ్తోంది. జనవరి 2022 నుంచి ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ సగటున 30శాతానికి పెరిగింది. అక్టోబర్ 2022 నుంచి పెద్ద పరిశ్రమలకు క్రెడిట్ రెండంకెల వృద్ధిని చూపుతోంది.
మరికొన్ని...
- 2022 , 2023 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎగుమతులు బాగా పెరిగాయి. తయారీరంగం బాగుండటమే ఇందుకు కారణం. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2019 ఆర్థిక సంవత్సరం ఇవి 4.4 బిలియన్ డాలర్ల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో 11.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
- భారతదేశం రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్‌సెట్‌ల ఉత్పత్తి 2015 ఆర్థిక సంవత్సరంలో ఆరు కోట్ల యూనిట్ల నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో 29 కోట్ల యూనిట్లకు పెరిగింది.
- ఫార్మా పరిశ్రమలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నాలుగు రెట్లు పెరిగాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో 180 మిలియన్ డాలర్ల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 699 మిలియన్ డాలర్లకు ఎగిశాయి.
- తయారీరంగం కోసం ఐదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో 14 కేటగిరీలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాలను ప్రవేశపెట్టారు. 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎల్ఐ పథకాల కింద రూ.47,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- సేవల రంగం 2022 ఆర్థిక సంవత్సరంలో 8.4శాతానికి నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 9.1శాతం వృద్ధి చెందుతుందని అంచనా. 2022 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగంలోకి 7.1 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ ఈక్విటీలు వచ్చాయి.
సర్వే ఎన్నో ఆసక్తికరమైన సంగతులను తెలియజేసింది. భారత ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి వివరాలను అందించింది. దీనిని బట్టి బడ్జెట్ ఎలా ఉండబోతోందో అర్థమైంది. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) లక్ష్యాన్ని చేరుకోవడం అభినందనీయమని చెప్పాలి. దీనివల్ల మాక్రో ఎకానమీ బాగుపడుతుంది. క్యాపెక్స్‌ను, ప్రత్యేకించి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను పెంచుతుంది. ఆర్థిక రంగం పనితీరును పెంచే చురుకైన విధానాలను ప్రభుత్వం గుర్తించింది. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీమా మార్కెట్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక ముఖ్యమైన విజయం. గ్లోబల్ మార్కెట్లో సమస్యలు ఉన్నప్పటికీ మన ఎకానమీని ముందుకు తీసుకెళ్లడా నికి ప్రభుత్వం నిర్ణయా లు తీసుకుంటున్నది.
- సంజీవ్ బజాజ్, సీఐఐ ప్రెసిడెంట్
మార్కెట్‌కు కొద్దిపాటి లాభాలు
ముంబై: యూనియన్ బడ్జెట్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటుపై నిర్ణయానికి ముందు పెట్టుబడిదారులు అలెర్ట్‌గా ఉండటంతో మంగళవారం ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు కొద్దిపాటి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 49.49 పాయింట్ల లాభంతో 59,550 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది గరిష్టంగా 59,787.63 స్థాయిని తాకింది. నిఫ్టీ 13.20 పాయింట్లు పెరిగి 17,662.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్ గెయినర్స్ చార్ట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా 3.53 శాతం జంప్‌తో మొదటిస్థానంలో ఉండగా, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, ఎస్‌బిఐ, ఐటిసి, టాటా మోటార్స్, టైటాన్, ఎన్‌టిపిసి తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సిలు వెనుకబడి ఉన్నాయి. ప్రీ-బడ్జెట్ ఎకనామిక్ సర్వే, భారతదేశ ఆర్థిక వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6–6.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 7 శాతం ఉండొచ్చని పేర్కొంది. ఇప్పుడు అందరి దృష్టి కేంద్ర బడ్జెట్‌పై ఉందని, బుధవారం మార్కెట్లో ఆటుపోట్లు ఉంటాయని భావిస్తున్నామని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు చెందిన అజిత్ మిశ్రా అన్నారు. విస్తృత మార్కెట్లలో, బీఎస్ఈ మిడ్‌క్యాప్ స్మాల్‌క్యాప్ సూచీలు 2.21 శాతం వరకు పెరిగాయి. యుఎస్ ఫెడరల్ మీటింగ్ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. సియోల్, టోక్యో, షాంఘై హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మిడ్ సెషన్ డీల్స్ సమయంలో యూరప్‌లోని ఈక్విటీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు నెగటివ్‌గా ముగిశాయి. డాలర్‌తో రూపాయి 41 పైసలు తగ్గి 81.93 (తాత్కాలికం) వద్ద ముగిసింది.
పన్నుల ఆదాయం బేష్
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది. డైరెక్ట్ ట్యాక్సెస్, జీఎస్టీలో బలమైన వృద్ధి కారణంగా స్థూల పన్నుల ఆదాయం 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 15.5 శాతం పెరిగింది. సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బాగున్నాయి. జీఎస్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన ఆదాయ వనరుగా మారింది. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వార్షిక ప్రాతిపదికన స్థూల జీఎస్టీ వసూళ్లు 24.8 శాతం పెరిగాయి. కేంద్రం క్యాపెక్స్ జీడీపీ (2009 ఆర్థిక సంవత్సరం నుంచి 2020 ఆర్థిక సంవత్సరం వరకు) దీర్ఘకాలిక సగటు 1.7 శాతం నుంచి 2022 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 2.5 శాతానికి పెరిగింది. రోడ్లు, హైవేలు, రైల్వేలు హౌసింగ్, అర్బన్ డెవెలప్మెంట్ వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం పెరిగింది.
జనవరి జీఎస్టీ వసూళ్లు రూ.1.55 లక్షల కోట్లు
జనవరి నెల జీఎస్టీ వసూళ్లు రూ.1.55 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది. నెలవారీగా చూస్తే ఇది రెండో అత్యధిక కలెక్షన్ అని పేర్కొంది. జనవరి 2023 దాకా కలిపి చూస్తే జీఎస్టీ వసూళ్లు 24 శాతం పెరిగాయి. అయితే 2022 జనవరి-నవంబర్ మధ్య ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్రోత్ (లోన్లు) 30.5 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో క్యాపెక్స్ 63.4 శాతం పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఇది మేలు చేస్తుంది.