మా పిల్లలు కనీసం డిగ్రీ చదవాలి.. గ్రామీణ భారతంలో 78% పేరెంట్స్ కోరిక

మా పిల్లలు కనీసం డిగ్రీ చదవాలి.. గ్రామీణ భారతంలో 78% పేరెంట్స్ కోరిక
  • నివేదికను విడుదల చేసిన కేంద్ర విద్యా మంత్రి

న్యూఢిల్లీ : తమ పిల్లలు కనీసం డిగ్రీ వరకు చదవాలని గ్రామీణ భారతంలోని 78% పేరెంట్స్ కోరుకుంటున్నారు. ‘ద స్టేట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్  ఇన్  రూరల్  ఇండియా’ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఈ రిపోర్టును కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  విడుదల చేశారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో 6,229 గ్రామాల్లో డెవలప్ మెంట్  ఇంటెలిజెన్స్  యూనిట్ (డీఐయూ) ఈ సర్వే చేసింది. ఆరేండ్ల నుంచి 16 ఏండ్ల వయసు ఉన్న పిల్లలు ఈ సర్వేలో పాల్గొన్నారు. 

82% మంది బాలుర తల్లిదండ్రులు, 78% మంది బాలికల పేరెంట్స్ తమ పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ప్రాథమిక విద్యాభ్యాసంలో చదువు మానేసిన మగ పిల్లల్లో నాలుగింట ఒక వంతు మంది తిరిగి స్కూళ్లలో చేరలేదని సర్వే వెల్లడించింది. ‘‘ప్రాథమిక విద్యాభ్యాసంలో డ్రాపౌట్  రేటు బాలికల విషయంలో ఎక్కువగా ఉంది. డ్రాపౌట్ లో బాలికలు 35% కాగా బాలుర శాతం 25గా తేలింది. 

ప్రాథమిక ఎడ్యుకేషన్  తర్వాత చదువు కొనసాగించాలనుకునే స్టూడెంట్లకు వారి గ్రామంలో స్కూళ్లు అందుబాటులో ఉండకపోవడం కూడా ఈ డ్రాపౌట్లకు ఒక కారణం కావచ్చు” అని సర్వే పేర్కొంది. ఇక స్టడీస్  విషయంలో 62.5% పిల్లలు తల్లుల పర్యవేక్షణలో చదువుతున్నారని, 49% పిల్లలు తండ్రుల పర్యవేక్షణలో చదువుతున్నారని అధ్యయనం వివరించింది. ఇక 38% పేరెంట్స్ తమ పిల్లలు చదువులో మరింత రాటు దేలేందుకు ట్యూటర్ల వద్దకు పంపుతున్నారని రిపోర్టు తెలిపింది. 

‘‘25.6% పిల్లలు అక్క లేదా అన్న గైడెన్స్ లో చదువుతున్నారు. 3.8% మంది అంగన్ వాడీల పర్యవేక్షణలో చదువుతున్నారు. ఇక 7.6 శాతం మందిని కమ్యూనిటీ టీచర్లు సూపర్ వైజ్  చేస్తున్నారు. అలాగే 64 శాతం మంది తమ తల్లుల పర్యవేక్షణలో చదువుతున్నారు” అని రిపోర్టు వివరించింది.