ఒక్కో రౌండ్ కౌంటింగ్‌కు 8 గంటలు

ఒక్కో రౌండ్ కౌంటింగ్‌కు 8 గంటలు
  • స్లోగా హైదరాబాద్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్
  • ఇయ్యాల రాత్రి వరకు కొనసాగనున్న కౌంటింగ్
  • నాలుగో రౌండ్ వరకు వాణీదేవికి 70,552,
  • రాంచందర్ కు 64,999 ఓట్లు
  • 5,553 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్– రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నిదానంగా నడుస్తోంది. వరంగల్ సెగ్మెంట్తో పోలిస్తే చాలా వెనుకబడి ఉంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కౌంటింగ్ ఆలస్యమవుతుండగా, జంబో బ్యాలెట్ల లెక్కింపు ప్రాక్టికల్గా ఇబ్బందిగా మారింది. దీంతో హైదరాబాద్ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు ఈ రోజంతా కూడా కొనసాగేలా ఉంది. అదనపు సిబ్బందిని నియమించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కు దాదాపు 8 గంటల సమయం పడుతున్నది. ఇప్పటివరకు లెక్కించిన మొదటి ప్రయారిటీ ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 5,553 ఆధిక్యంతో ఉండగా, మరో మూడు రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మార్చి 17న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తొలి రౌండ్ ఓట్ల లెక్కలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం ఎనిమిది హాళ్లలో ఏడు రౌండ్లలో ఈ ప్రక్రియ కొనసాగునుంది. అయితే ఫలితాలు వస్తున్న తీరు చూస్తే శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ఉంది. 
 

రౌండ్‌కు 56 వేల ఓట్లు
మొత్తం ఏడు రౌండ్లలో ఒక్కో రౌండ్ కు 56వేల చొప్పున ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు నాలుగో రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇప్పటి వరకు దాదాపు 2.24 లక్షల ఓట్లను లెక్కించగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉండగా, మిగిలిన 88 మంది అభ్యర్థుల వచ్చిన ఓట్లు అన్ని కలిపినా 15 వేలు దాటలేదు. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ను గమనిస్తే ఏ అభ్యర్థికి కూడా పోలైన ఓట్లలో సగానికి పైగా వచ్చే పరిస్థితి లేదు. తొలి ప్రయారిటీ ఓట్లలో మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రయారిటీ ఓట్లతోనే ఫలితం తేలేలా ఉంది. 

 

ప్రతి రౌండ్లో సగటున 3వేల చెల్లని ఓట్లు
మొత్తం 2,24,032 ఓట్లు లెక్కించగా తొలి రౌండ్ లో 3,374 , రెండో రౌండ్ లో 3,375, మూడో రౌండ్లో3,333, నాలుగో రౌండ్లో 3,282 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన ఏడు రౌండ్లలో కలిపి దాదాపు 22 వేల వరకు చెల్లని ఓట్లు ఉండే చాన్స్ ఉందని ఏజెంట్లు చెబుతున్నారు. పోలైన ఓట్లలో సుమారు 6%శాతం. చెల్లని ఓట్లలో ఎక్కువగా టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చినట్లుగా తెలిసింది. 2015 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో 9% చెల్లని ఓట్లు పోలయ్యాయి.

 

టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం
ఇప్పటివరకు తేలిన మూడు రౌండ్ల కౌంటింగ్ ఫలితాలలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావు గట్టి పోటీనిస్తుండగా, వీరిద్దరి మధ్య ఓట్ల తేడా 5,553 మాత్రమే. ప్రతి రౌండ్ లో వీరి మధ్య ఓట్ల తేడా 1,300కి పైగా ఉంది. మిగిలిన మూడు రౌండ్లలో ఫలితాలు మారే అవకాశం ఉందని రాజకీయ శ్లేషకులు భావిస్తున్నారు. అయితే పోలైన ఓట్లను బట్టి రెండో ప్రాధాన్యత ఓట్లే అభ్యర్థి గెలుపులో కీలకంగా మారనున్నాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో మూడు రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 70,552 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాంచంద్రారావు 64,999, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 20,053 ప్రొ. నాగేశ్వర్ కు 34,029 ఓట్లు మాత్రమే రాగా, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 3,672 మంది ఓటేశారు.