హైదరాబాద్లో విషాదం జరిగిన రోజే మరో ఘోరం.. ఎనిమిది మంది సజీవ దహనం

హైదరాబాద్లో విషాదం జరిగిన రోజే మరో ఘోరం.. ఎనిమిది మంది సజీవ దహనం

సోలాపూర్: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఆదివారం వేకువజామున 3 గంటల 45 నిమిషాల సమయంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోలాపూర్ ఎంఐడీసీలోని (Maharashtra Industrial Development Corporation) అక్కల్కోట్ రోడ్ లో ఉన్న సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఫ్యాక్టరీ యజమాని హజి ఉస్మాన్ హసన్ భాయి మన్సూరితో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఏడాదిన్నర వయసున్న ఫ్యాక్టరీ యజమాని మనమడు కూడా ఉండటం అత్యంత శోచనీయం. చనిపోయిన మిగిలిన నలుగురు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు. ఈ నలుగురు కార్మికుల్లో ముగ్గురు మహిళలే కావడం గమనార్హం.

మంటలు భారీగా ఎగసిపడటంతో అగ్నిమాపక సిబ్బంది ఐదారు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ బిల్డింగ్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్లలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు.

ALSO READ | ఉదయం పాతబస్తీ..మధ్యాహ్నం మైలార్ దేవ్ పల్లి..సాయంత్రం చర్లపల్లి.. వరుస అగ్నిప్రమాదాలతో హడలెత్తిన హైదరాబాద్