8 ఏండ్లకే 80 ఏండ్లు వచ్చినయ్‌!

8 ఏండ్లకే 80 ఏండ్లు వచ్చినయ్‌!

అప్పుడే నూరేళ్లు నిండినయ్‌

ప్రపంచంలో కేవలం 160 కేసులు

బిగ్​బీ అమితాబ్​ ‘పా’ సినిమా కాన్సెప్ట్​ ప్రొజీరియానే

ఆ చిన్నారి వయసు ఎనిమిదేళ్లే. కానీ, ఆ పసిప్రాయంలోనే 80 ఏళ్ల వయసు వచ్చినట్లయింది ఆ చిన్నారికి. ఒంట్లోని అవయవాలు పనిచేయక శనివారం చనిపోయింది. అర్థం కాలేదా? బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ ‘పా’ సినిమా చూశారా..? ఆ సినిమాలో ఆయన ‘ప్రొజీరియా’ అనే జీన్స్​కు సంబంధించిన జబ్బుతో బాధపడుతుంటారు. అంటే, చిన్న పిల్లాడే అయినా, ముసలాడిలా కనిపించే జబ్బు. సింపుల్​గా చెప్పాలంటే చిన్న వయసులోనే ముసలోళ్లలా మారిపోవడం. సేమ్​ అలాంటి జబ్బే చనిపోయిన ఆ చిన్నారిది. ఉక్రెయిన్​కు చెందిన అన్నా సకిడన్​కు ఎదురైందీ పరిస్థితి. పోయిన నెలలోనే ఆ పాపకు 8 ఏళ్లు నిండాయి. ఆమె చిన్నప్పుడే హచిసన్​ గిల్ఫోర్డ్​ ప్రొజీరియా సిండ్రోమ్​ అనే జబ్బు బారిన పడింది. మూడేళ్లు వచ్చే సరికి వృద్ధాప్య ఛాయలు ఆ ప్రసిప్రాయంపై దాడి చేశాయి. పెద్దవుతున్న కొద్దీ అది మరింత ముదిరింది. డాక్టర్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. అన్నా దక్కలేదు. ప్రొజీరియాతో బాధపడే పిల్లలకు ఒక్క సంవత్సరం 8 నుంచి పది సంవత్సరాలతో సమానమని డాక్టర్లు చెబుతున్నారు. ఆ లెక్కన ఆ పాపకు 80 ఏళ్లు వచ్చినట్టేనన్నారు. ఆ జన్యు సమస్యల వల్ల ఎముకలు స్లోగా ఎదిగాయని, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు వంటి అవయవాలు వేగంగా ఏజ్​ అయ్యాయని చెప్పారు. దాని వల్ల అన్నాకు ఎన్నోసార్లు స్ట్రోక్స్​ వచ్చాయని, పెరాలిసిస్​ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయని, ఆ తర్వాత ఆమె పరిస్థితి మరింత క్షీణించి చనిపోయిందని డాక్టర్లు తెలిపారు.

ఏంటీ ప్రొజీరియా..?

హచిసన్​ గిల్ఫోర్డ్​ ప్రొజీరియా సిండ్రోమ్​ (హెచ్​జీపీఎస్​)నే ప్రొజీరియా అని పిలుస్తుంటారు. చిన్న పిల్లలు తొందరగా ముసలోళ్లయ్యే జెనెటిక్​ జబ్బు. ఆ జబ్బు చేసిన పిల్లలు 13 ఏళ్లకు మించి బతకరు. 40 లక్షల పిల్లల్లో ఒకరికి ఈ జబ్బు చేస్తుంది. ఒక జీన్​లో జరిగే ఓ చిన్న తప్పు వల్ల అసాధారణ ప్రొటీన్​ పుడుతుంది. ఆ ప్రొటీన్​ పేరే ప్రొజీరిన్​. శరీరంలోని కణాలు ఈ ప్రొటీన్​ను వాడుకుని ఈజీగా బ్రేక్​డౌన్​ అయిపోతాయి. దీంతో అన్ని కణాల్లో ఆ ప్రొటీన్లు పేరుకుపోతుంటాయి. దాని ప్రభావం ఒంట్లోని అవయవాలపై పడుతుంది. త్వరగా వాటి వయసు అయిపోతుంది. బాడీ ఎదగకపోయినా, అవి ముసలిగా అవడం వల్ల శరీర క్రియ మందగిస్తుంటుంది. దీంతో స్ట్రోక్స్​ వంటివి వచ్చి పిల్లలు చనిపోతుంటారు. ఎక్కువగా గుండె పోటు వస్తుంది. మెదడుపై దాని ప్రభావం ఉండదు. వాళ్ల తెలివితేటలపై ప్రభావం చూపించదు. అయితే, ఇది వారసత్వంగా పిల్లలకు సంక్రమించదు. ప్రస్తుతం ప్రపంచంలో ఇలాంటి పిల్లలు 160 మంది దాకా ఉన్నారని ఓ అంచనా.