
ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా, హాఫిజ్పూర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం అర్థరాత్రి రోడ్డుపై వేగంగా వస్తున్న ట్రక్కును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది పెళ్లివేడుకకు హాజరై ట్రక్కులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఓవర్‌టేక్ చేయడం కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని వాహనం ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు.