కామారెడ్డిలో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి

కామారెడ్డిలో రైలు ఢీకొని 90 గొర్రెలు మృతి
  • వాగులో దూకిన కాపరి కూడా.. కామారెడ్డి వద్ద ఘటన

కామారెడ్డి టౌన్​, వెలుగు : వాగు వద్ద  పట్టాలు దాటుతుండగా గొర్రెలను రైలు  ఢీ కొట్టడంతో 90   చనిపోయాయి. భయంతో వాగులో దూకిన కాపరి నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఆదివారం    జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ  దేవునిపల్లికి చెందిన  దర్శపు సుధాకర్​  తన గొర్రెలను మేపుకుంటూ రైల్వే లైన్​ వెంట వెళ్తున్నాడు.  

వాగు సమీపంలో గొర్రెలను  పట్టాలు దాటిస్తుండగా.. ఆ సమయంలో  రైలు రావడాన్ని గమనించలేదు.   నిజామాబాద్​ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న  రైలు ఢీ కొట్టడంతో 90 గొర్రెలు చనిపోయాయి.  కాపరి  సుధాకర్ (38)  భయంతో వాగులో దూకడంతో  నీట మునిగి మృతి చెందాడు.   రైల్వే పోలీసులు  ఘటనా స్థలానికి వెళ్లి  డెడ్ బాడీని బయటకు తీశారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింబాద్రి తెలిపారు.  బాధిత కుటుంబాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే  వెంకట రమణరెడ్డి పరామర్శించారు.