కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది.  నిర్మాణంలో ఉన్న ఓ 5 అంతస్తుల భవనం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ కోల్‌కతాలోని మెటియాబ్రూజ్‌లో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు,ఫైర్,  రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన పలవురిని పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

కోల్‌కతా పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. "ఆదివారం అర్థరాత్రి గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని రక్షించాం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది" అని అయన తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా సంఘటనాస్థాలనికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అక్రమ నిర్మాణం కారణంగానే నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని ఆయన ఆరోపించారు. అక్రమ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.