Rs. 50 లక్షలు ఇయ్యకుంటే కాల్చి చంపుతా!..వ్యాపారికి యువకుడి బెదిరింపు

Rs. 50 లక్షలు ఇయ్యకుంటే కాల్చి చంపుతా!..వ్యాపారికి యువకుడి బెదిరింపు
  •     సినిమాలు చూసి బ్లాక్​మెయిల్​ స్కెచ్​
  •     బిహార్​కు వెళ్లి ఫైరింగ్​లో ట్రైనింగ్​
  •     గన్స్​ పట్టుకొచ్చి చంపేందుకు ప్లాన్​
  •     పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితుడు

కాగజ్ నగర్, వెలుగు: ఓ యువకుడు ఈజీ మనీ కోసం సినిమాల్లో మాదిరిగా స్కెచ్​ వేశాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే తుపాకీతో కాల్చి చంపుతానని వ్యాపారిని బెదిరించాడు. ఇందుకోసం ఏకంగా ఫైరింగ్​ కూడా నేర్చుకున్నాడు. 

గన్స్​ పట్టుకొచ్చి చంపాలని పథకం పన్నాడు. ప్లాన్​ బెడిసికొట్టి పోలీసులకు చిక్కాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కౌటాల పోలీస్​స్టేషన్​లో ఎస్పీ నితిక పంత్​ వెల్లడించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కౌటి గ్రామానికి చెందిన కర్మంకర్ అజయ్(31) డిగ్రీ కంప్లీట్ చేసి ఫెర్టిలైజర్ షాపు నడిపిస్తున్నాడు. ఇందులో ఆశించిన రాబడి లేకపోవడంతో అక్రమార్గంలో డబ్బు సంపాదించాలని డిసైడ్​ అయ్యాడు. 

యూట్యూబ్ లో హిందీ సినిమాలు చూసి గన్ తో బెదిరించి డబ్బులు వసూలు చేసే సీన్లకు అట్రాక్ట్​ అయ్యాడు. అలానే తాను కూడా చేయాలనుకున్నాడు. ఓ వ్యాపారిని టార్గెట్ చేసి జూన్ 12న అతని షాపు ఎదుట లెటర్​ అంటించాడు. రూ.50 లక్షలు మహారాష్ట్రలోని చంద్రపూర్ బస్టాండ్ కు తెచ్చి ఇవ్వాలని, లేదంటే నిన్ను, నీ ఫ్యామిలీని కాల్చి చంపుతానని అందులో పేర్కొన్నాడు. 

బిహార్​ నుంచి తుపాకులు తెచ్చి..

అజయ్​ అంటించిన లెటర్​కు వ్యాపారి స్పందించకపోవడంతో తుపాకులు ఎక్కడ దొరుకుతాయో యూట్యూబ్​ ద్వారా తెలుసుకున్నాడు. జులై చివరి వారంలో బిహార్ కు వెళ్లాడు. అక్కడ బాబూ సాహెబ్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.55 వేలకు ఒక పిస్టల్, ఒక తపంచా, రెండు మ్యాగజైన్ లు, 20 బుల్లెట్లు కొన్నాడు. 

అక్కడే పది రోజులు ఉండి తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. వెపన్స్​తో తిరిగి ఇంటికి వచ్చాడు. సెప్టెంబర్ 26న మరోసారి ఓ రైల్వే ప్యాసింజర్​ నంబర్​ నుంచి వ్యాపారికి ఫోన్​ చేసి బెదిరించాడు. అయినా స్పందన లేకపోవడంతో అక్టోబర్ 15న సదరు వ్యాపారి తమ్ముడు ఇంటికి వెళ్తున్న మార్గంలో బైక్ ఆపి లైట్ ఫోకస్ ముఖం మీద పెట్టి పిస్టల్ తో కాల్చాడు. 

తూటా గురితప్పడంతో పరార్ అయ్యాడు. ఈ ఘటనపై అక్టోబర్ 18న కౌటాల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. కౌటాల సీఐ సంతోష్ కుమార్, కౌటాల, కాగ జ్ నగర్ రూరల్ ఎస్సైలు చంద్రశేఖర్, సందీప్ కుమార్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి వ్యాపారి తమ్ముడిని షాపునకు వచ్చే సమయంలో చంపాలని అజయ్​ ప్లాన్​ వేశాడు.

 బైక్ మీద వస్తుండగా ఎన్నికల కోడ్​లో భాగంగా ముత్యంపేట్ రోడ్డుపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా అజయ్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని తనిఖీ చేయగా పిస్టల్, మూడు బుల్లెట్లు దొరికాయి. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పాడు. 

ఆయుధాలు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, కౌటాల సీఐ సంతోశ్ కుమార్, ఎస్ఐ లు చంద్రశేఖర్, సందీప్ కుమార్, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.