హైదరాబాద్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ కొండగట్టు అంజన్న దేవాలయంలో గురువారం (అక్టోబర్ 29) హుండీలను లెక్కించారు. గడిచిన 80 రోజుల్లో అంజన్న ఆలయానికి కోటీ 23 లక్షల ఆదాయం వచ్చింది. అయితే, హుండీల్లో భక్తులు వింత వింత కోరికలు కోరుతూ వేసిన లేఖలు చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యంగా ఓ భక్తుడు రాసిన లేఖ నవ్వులు పూయిస్తోంది. తన పిల్లలు సరిగ్గా బడికి వెళ్లేలా చూడాలని.. అలాగే, తనకు 35వేల రూపాయలు లేదా తులం బంగారం, ఒక ఫోన్, డీపీఓ కార్యాలయంలో రీ పోస్టింగ్ ఇప్పించాలని లేఖలో హనుమంతున్ని కోరాడు.
తన కోరికలన్నీ నేరవేరిస్తే ఆంజనేయ స్వామికి వెండి గద చేయిస్తానని మొక్కాడు. ఒకవేళ తన కోరికలు నెరవేర్చకపోతే ఆంజనేయ స్వామి తన గదతో రెండు కొట్టి తనను చంపేయాలని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో లేఖలో గంగాధర మండలం నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు కోరారు.
