రన్​వేపైకి కుక్క.. వాపస్​ పోయిన ఫ్లైట్​

రన్​వేపైకి కుక్క.. వాపస్​ పోయిన ఫ్లైట్​

పణజి : రన్​వే మీదికి కుక్క రావడంతో ల్యాండింగ్ కావాల్సిన విమానం వెనుదిరగాల్సి వచ్చింది. సోమవారం గోవాకు  వచ్చిన విస్తారా ఎయిర్​లైన్స్ విమానానికి ఈ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు నుంచి సోమవారం మధ్యాహ్నం 12.55 గంటలకు 100 మంది ప్రయాణికులతో విమానం గోవాకు బయల్దేరింది. దబోలిమ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన టైంలోనే రన్​వేపైకి ఓ కుక్క రావడం గమనించిన ఎయిర్​పోర్టు సిబ్బంది పైలట్​ను అలర్ట్ చేశారు. దీంతో ఆ పైలట్ విమానాన్ని కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టించాడు.

ఈ కుక్క రన్​వేను ఎంతకూ వదలకపోవడంతో.. చేసేదేంలేక పైలట్ విమానాన్ని మళ్లీ బెంగళూరుకే మళ్లించాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. వాళ్లకు నచ్చజెప్పిన సిబ్బంది.. మళ్లీ సాయంత్రం 4.55 గంటలకు అదే విమానంలో గోవాకు తీసుకెళ్లారు. దబోలిమ్ ఎయిర్​పోర్టులో ఈసారి సేఫ్​గా ల్యాండ్ చేశారు.