
నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. కళ్లలో కారం కొట్టి కత్తులతో పొడిచి ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్‌కు చెందిన రౌడీ షీటర్ జీలకర ప్రసాద్‌కు ధర్మోరా గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళతో పరిచయముంది. అప్పుడప్పుడు ధర్మోరా గ్రామానికి వెళ్లి ఆమెను కలుస్తుంటాడు.
ఆదివారం (ఆగస్ట్ 24) రాత్రి కూడా స్వప్నను కలిసేందుకు వెళ్లాడు ప్రసాద్. అతడితో పాటు తన మిత్రుడు ఆశిష్‌ను కూడా తీసుకెళ్లాడు ప్రసాద్. ఈ క్రమంలో ప్రసాద్, ఆశిష్‌లతో స్వప్న బంధువులకు వాగ్వాదం జరిగింది. వివాదం ముదరటంతో ప్రసాద్, ఆశిష్‌పై దాడి చేశారు స్వప్న బంధువులు. కళ్ళలో కారం కొట్టి కత్తులతో పొడిచారు.
తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్, ఆశిష్ మరణించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కత్తులు సదరు రౌడీ షీటర్ తెచ్చినవిగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం నిజమాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ జంట హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.