- సాయంత్రం దాకా సరదాగా గడిపిన తర్వాత దారుణం
- మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : ప్రాజెక్ట్ ఒడ్డున పిల్లలతో రోజంతా సరదాగా గడిపిన ఓ వ్యక్తి... తర్వాత పిల్లలను ప్రాజెక్ట్‌లోకి తోసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన బోయ కృష్ణ (34) సవిత దంపతులకు కొడుకు రక్షిత్ (9), బిడ్డ అనన్య (5) ఉన్నారు. వీరు కొంతకాలంగా పటాన్‌చెరు సమీపంలో ఉంటున్నారు. కృష్ణ పెయింటర్‌గా, సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా.. సవిత కూలీ పనులకు వెళ్లేది.
గురువారం ఉదయం 9 గంటలకు కృష్ణ తన పిల్లలు రక్షిత్, అనన్యను తీసుకొని బైక్‌పై కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. మధ్యాహ్నం భోజనాలు కొనుగోలు చేసి తెచ్చుకొని ప్రాజెక్ట్ పరిసరాల్లోనే తిన్నారు. సాయంత్రం వరకు అక్కడే పిల్లలతో సరదాగా గడిపాడు. ప్రాజెక్ట్ పరిసరాల్లో తిరుగుతున్న ఫొటోలు తీసి బంధువులకు పంపించాడు.
ఇదే క్రమంలో తాను ప్రాజెక్ట్‌లో దూకి చనిపోతున్నానని వాట్సప్‌లో మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఆరేపల్లి శివారులోని ప్రాజెక్ట్‌లో ఇద్దరు పిల్లలను తోసిన అనంతరం తాను కూడా దూకేశాడు. వాట్సప్ మెసేజ్ చూసిన బంధువులు శుక్రవారం ఉదయం నిజాంసాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు ఘటనాస్థలానికి చేరుకొని నీటిలో గాలించగా.. ముగ్గురి డెడ్‌బాడీలు దొరికాయి. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. మృతుడి అన్న సాయిలు ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
