- ఓ వ్యక్తిని కాలితో తన్నిన ఏఆర్ కానిస్టేబుల్
- రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్న బీసీ, ఎస్సీ వర్గాలు
- ఆపేందుకు యత్నించిన ఏఎస్సైపై దాడి చేసిన కానిస్టేబుల్
కోదాడ, వెలుగు : దసరా ఉత్సవాల టైంలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ అతి ప్రవర్తన ఇరువర్గాల మధ్య గొడవ సృష్టించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలులో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వట్టికూటి నాగయ్య దసరా సందర్భంగా శనివారం అమ్మవారి ఆలయానికి వెళ్లాడు. ఆ సమయంలో మూత్ర విసర్జన చేసేందుకు ఆలయం వెనుక వైపునకు వెళ్లాడు.
అయితే అతడు ఆలయ పరిసరాల్లోనే మూత్ర విసర్జన చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్ వీడియో తీస్తూ, నాగయ్యను వెనుక నుంచి కాలితో తన్నాడు. తర్వాత వీడియోను గ్రామానికి చెందిన వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నాగయ్యకు, వరకుమార్‌కు మధ్య గొడవ జరిగింది.
వీడియోను చూసిన బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారు గుడి వద్దకు చేరుకోవడంతో గొడవ మరింత పెరిగింది. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడంతో నాగయ్య అనుచరుడు గాయపడ్డాడు. అక్కడే బందోబస్తులో ఉన్న చిలుకూరు ఏఎస్సై వెంకటేశ్వర్లు గొడవ పడుతున్న వరకుమార్‌ను ఆపేందుకు ప్రయత్నించగా అతడు ఏఎస్సైపై దాడి చేశాడు. దైవ దర్శనం కోసం వచ్చిన కోదాడ టౌన్ సీఐ రాము గొడవ పడుతున్న వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అతడి తలకు ఓ ప్లాస్టిక్ పైప్ తగలడంతో గాయమైంది. తర్వాత గొడవకు కారణమైన ఏఆర్ కానిస్టేబుల్ వరకుమార్‌తో పాటు మరో ఇదుగురిపై చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూరల్ సీఐ రజితరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.