ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆకతాయి పనేనా..?

ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆకతాయి పనేనా..?

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మణవాడి కాలనీలో శుక్రవారం (డిసెంబర్ 22న) అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మణవాడి కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించగా.. గాలికి ఆ నిప్పు కణికలు కిటికీలో నుంచి శ్రీనివాస్ దంపతుల ఇంట్లోకి చేరాయి. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరగ్గానే మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. మంటలు కొద్దికొద్దిగా వ్యాపిస్తూ ఇంట్లోని ఫర్నిచర్, ఇతర విలువైన వస్తువులకు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే.. అప్పటికే నష్టం జరిగిపోయింది. 

ప్రమాదంపై బాధితురాలు సరిత బోరున విలపించారు. చదువుకుంటున్న తమ పిల్లల కోసం కొన్న లక్ష రూపాయల ల్యాప్ టాప్ మంటల్లో కాలిపోయిందని చెప్పారు. డ్వాక్రా గ్రూపులో లోన్ తీసుకొని ఇన్ స్టాల్ మెంట్ లో ల్యాప్ టాప్ కొన్నామని, ఇప్పటికి రెండు ఈఎంఐలు మాత్రమే చెల్లించాలని, మిగతా డబ్బులు చెల్లించేందుకు తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.5 నుంచి 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు.