సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు “హాలీవుడ్ టు హైదరాబాద్” కాన్సెప్ట్‌తో భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే కొత్త మైలురాయిగా ‘సినిమాటికా ఎక్స్‌పో 2025’ ఉండబోతోందని అన్నారు పీజీ విందా. రెండు దశాబ్ధాలుగా సినిమాటోగ్రాఫర్‌గా మెప్పిస్తున్న ఆయన.. గత రెండేళ్లుగా సినిమాటికా ఎక్స్‌పోను నిర్వహిస్తున్నారు.
కెమెరాలు, ఇతర ఎక్విప్‌మెంట్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తూ, వాటిపై అవగాహన కల్పించేలా దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. నవంబర్ 1, 2 తేదీలలో హైటెక్ సిటీలోని నోవాటెల్ హెచ్‌ఐసీసీలో ఈఎక్స్‌పో 3వ ఎడిషన్ జరగబోతోంది.
ఈ సందర్భంగా పీజీ విందా మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో సినిక క్రియేటర్స్ కౌన్సిల్, ఇండియా జాయ్ సంస్థల సహకారంతో ‘హాలీవుడ్ టు హైదరాబాద్’ అనే థీమ్‌తో దీన్ని నిర్వహిస్తున్నాం. భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టడమే మా లక్ష్యం. పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఇందులో పాల్గొంటున్నాయి. సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఫిల్మ్‌మేకింగ్ లాంటి ఆధునిక సాంకేతికతలపై మాస్టర్ క్లాసులు, వర్క్‌షాప్‌లు, నెట్‌వర్కింగ్ సెషన్లు జరగబోతున్నాయి.
సినిమా, టెక్నాలజీ, ఆర్ట్, మరియు కల్చర్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడం మా లక్ష్యం” అని చెప్పారు. భవిష్యత్తులో ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన కెమెరాలు, సాఫ్ట్‌వేర్స్ అన్నీ హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంజా శ్రవణ్ తెలియజేశారు.
