మోడీ పాలనలోనే .. బీసీలకు న్యాయం

మోడీ పాలనలోనే .. బీసీలకు న్యాయం

దేశంలో బీసీలు నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నారు. కేంద్రంలో సుమారు అర్ధ శాతాబ్దానికిపైగా ఏలిన కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయలేదు. నెహ్రూ ప్రభుత్వం నుంచి మన్మోహన్ సింగ్ సర్కార్ వరకు బీసీలకు ఎలాంటి  రాజకీయ సామాజికపరమైన అవకాశాలను దరిచేరనీయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీల మద్దతుతో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు ఎన్నడూ ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వలేదు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, శివశంకర్, వి. హనుమంతరావు లాంటి బలమైన నేతలు ఉన్నప్పటికీ అవకాశం దక్కలేదు. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత మాత్రమే బీసీల నాయకత్వం ఎదిగివచ్చింది. అప్పటివరకు రాష్ట్ర రాజకీయాల్లో బీసీల ఉనికి, అస్తిత్వం ప్రశ్నార్థకంగా ఉండేది. దేశ రాజకీయాల్లో బీసీల ఉనికి నరేంద్ర మోదీతో ప్రారంభమైంది. ఈ కాలంలో ఒక రకంగా బీసీల రాజకీయ ప్రాభవానికి స్వర్ణయుగంగా పేర్కొనవచ్చు. తన క్యాబినెట్​లో 27 మంది బీసీలకు చోటు కల్పించి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అందులో  బీసీ మహిళలకూ అధికంగా చోటు కల్పించడం విశేషం. దేశ ఉప రాష్ట్రపతిని సైతం బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వడం.. మోదీ హయాంలో  బీసీలకు జరిగిన సామాజిక న్యాయంలో గొప్ప విషయం. 

రిజర్వేషన్లు కల్పించి..

కేంద్ర విద్యాలయాల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయడం మోదీ హయాంలో బీసీలకు దక్కిన మరో విప్లవాత్మక ఫలితం. బీసీల్లోని సంచార కులాల స్థితిగతులపై అధ్యయనం కోసం కమిషన్  వేసి సంచార కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాల సాధికారత కోసం భారత రాజ్యాంగంలోని 340 అధికరణల ద్వారా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి, తద్వారా అత్యంత వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ వికాసం కోసం కృషి చేస్తున్నారు. బీసీ ప్రధాని దేశానికి ఉంటే ఎన్ని పనులు చేయొచ్చో అన్ని పనుల్నీ మోదీ ఆచరణలో పెడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో  అన్ని బీసీ  వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడమే కాకుండా అత్యంత వెనుకబడిన వర్గాలకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అవకాశం ఇవ్వడం మోదీ ఆలోచనల్లో భాగంగానే చూడాలి. భారతీయ జనతా పార్టీలో బీసీ మోర్చా ప్రాధాన్యం  నరేంద్ర మోదీ కేంద్ర రాజకీయాల్లోకి  వచ్చాకనే పెరిగింది. నేడు దేశ రాజకీయాల్లో ఓబీసీ మోర్చా ఉనికి ప్రధానంగా మారింది. బీజేపీలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పార్లమెంట్ బోర్డులో కూడా హర్యానాకు చెందిన ఎంపీ డా. సుధ యాదవ్, తెలంగాణ నుంచి డా. కె. లక్ష్మణ్ కు ప్రాతినిధ్యం లభించింది. సామాజిక సమీకరణలో బీసీ భాగస్వామ్యం ప్రతి చోటా ఉండేలా చూస్తున్నారు మోదీ. రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం అనే షరా మామూలుగా వాడే నినాదాల కన్నా సమగ్ర సామాజిక న్యాయ సూత్రాన్ని ఆచరణలో పాటించిన వ్యకి భారత ప్రధాని మోదీ మాత్రమే.

తెలంగాణ నాయకులకు పెద్దపీట

తెలంగాణకు చెందిన బీసీ నాయకుల్లో బండి సంజయ్​కి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి ఇవ్వడం, డా.కె. లక్ష్మణ్ కు ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డులో అవకాశం కల్పించడం, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్​గా నియమించడం వంటి పరిణామాలు బీసీల రాజకీయ ఎదుగుదలకు దోహదపడుతున్నాయి. బీహార్, యూపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీ పాతినిధ్యాన్ని పతాక స్థాయిలో పెంచిన ఘనత మోదీదే.  బీజేపీ అంటే బ్రాహ్మణ, బనియాల పార్టీగా ఉన్నదన్న విమర్శల నుంచి పూర్తి స్థాయి సబ్బండ వర్గాల పార్టీగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్రమోదీకే దక్కుతుంది. పార్టీ నిర్మాణంలో ఇప్పటికే భూపేందర్ యాదవ్ లాంటి వారు కీలకంగా పనిచేస్తున్నారంటే అది మోదీ చలువే. గిరిజన మహిళకు,  దళిత వర్గానికి చెందిన రామ్​నాథ్​కోవింద్ కు రాష్ట్రపతి ఇలా అన్నింటా బడుగు వర్గాల ప్రాతినిధ్యం మోదీ హయంలోనే సాధ్యమవుతున్నాయి. దేశ రాజకీయాల్లో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా బీసీ ఓటు బ్యాంకు బీజేపీకి పదిలంగా మారుతున్నది. బీజేపీ బలంలో బీసీలే అధికం.

బీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా..

సోషల్ ఇంజనీరింగ్ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం మోదీతోనే ప్రారంభమైంది. అలంకార ప్రాయంగా ఉన్న ఖాదీ బోర్డును బలోపేతం చేసి గ్రామీణ వృత్తుల ఆధునీకరణకు దోహదపడ్డారు. ఖాదీ బోర్డ్ ద్వారా వృత్తి ఆధునిక యంత్రాలు, క్లస్టర్లు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల తోడ్పాటునందించారు. చేనేత, కుండల తయారీ క్లస్టర్లు విజయవంతం గా నడుస్తున్నాయి. ఎలాంటి చట్టబద్ధత లేని జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించారు. దేశ వ్యాప్తంగా బీసీలకు సం బంధించిన అనేక సమస్యల పరిష్కారానికి బీసీ కమిషన్ వేదిక అయింది. బీసీల సత్వర న్యా యం కోసం విచారణ జరిపి, జిల్లా కలెక్టర్ ఎస్పీలను సైతం కమిషన్ ముందుకు పిలిపించుకుని బాధిత బీసీ కులాలకు న్యాయం జరిగేలా ఆదేశాలు ఇస్తున్నారంటే బీసీ కమిషన్ కు మోదీ ప్రభుతం ఇచ్చిన రాజ్యాంగ హోదా కారణం.న్యాయ స్థానాల్లో దొరకని సత్వర న్యాయం బీసీ కమిషన్ ద్వారా బీసీలకు అందుతున్నది.

- దొమ్మాట వెంకటేశ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్