కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడ్తం : పినాకి చంద్రఘోష్

కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడ్తం : పినాకి చంద్రఘోష్
  • రాష్ట్ర ఇరిగేషన్ ​అధికారులతో విచారణ కమిటీ చైర్మన్​ జస్టిస్​ ఘోష్ 
  • కోల్​కతాలో ఘోష్​తో సమావేశమైన ఇరిగేషన్​ సెక్రటరీ, ఈఎన్సీలు
  • టెండర్ల ప్రాసెస్​ నుంచి కంప్లీషన్​ సర్టిఫికెట్ల జారీవరకు 
  • అవకతవకలను బయటకు తీయాలని విజ్ఞప్తి
  • బీఆర్​కే భవన్ 8వ ఫ్లోర్​లో విచారణ కమిటీ ఆఫీసు ఏర్పాటు!

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై త్వరలోనే జ్యుడీషియల్ విచారణ ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్​అధికారులకు జ్యుడీషియల్​ విచారణ కమిటీ చైర్మన్​ పినాకి చంద్రఘోష్  హామీ ఇచ్చారు. కోల్​కతాలో  పినాకి చంద్రఘోష్​తో ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా, ఈఎన్సీ నాగేందర్​రావు, డిప్యూటీ ఈఎన్సీ కే  శ్రీనివాస్ మంగళవారం సమావేశమయ్యారు.  కాళేశ్వరం  ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను వేగవంతం చేయాలని కోరారు. 

ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైనా సమాంతరంగా విచారణ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే హైదరాబాద్​కు వస్తానని ఇరిగేషన్​ అధికారులకు జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎప్పుడు వస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ వీలైనంత త్వరగానే ఇక్కడకు వచ్చి విచారణను ప్రారంభిస్తామని చెప్పినట్టు తెలుస్తున్నది.

మరోవైపు జ్యుడీషియల్​ విచారణ కమిటీ కోసం బీఆర్​కే భవన్​లోని ఎనిమిదో ఫ్లోర్​లో ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిసింది. అక్కడ ఏఈ నుంచి సీఈల వరకు అధికారులు, ముగ్గురు లాయర్లను నియమించనున్నారు. మరోవైపు ఏడు పాయింట్లతో జస్టిస్​ ఘోష్​కు అధికారులు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిసింది. మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణ లోపాలు, ఆపరేషన్లలో అవకతవకల వంటి వాటిపై విచారణ చేయాలని కోరినట్టు సమాచారం.

టెండర్ల ప్రాసెస్​దగ్గరినుంచి బ్యారేజీలను పూర్తి చేసినట్టుగా కాంట్రాక్టర్లకు కంప్లీషన్​ సర్టిఫికెట్లు ఇచ్చిన టైమ్​లైన్​ వరకు జరిగిన అక్రమాలను బయటకు తీయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. క్వాలిటీ కంట్రోల్​లో తీసుకున్న జాగ్రత్తలు, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం, రూల్స్​కు విరుద్ధంగా పనుల పూర్తికి గడువు పొడిగించడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై పడిన ఆర్థిక భారం వంటి వాటిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కోరినట్టు సమాచారం. విచారణను వెంటనే ప్రారంభించి, జూన్​ 30 నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులు కోరినట్టు తెలిసింది.

ప్రభుత్వ వాదనలువిన్న తర్వాతే ఉత్తర్వులు ఇస్తం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే పిల్స్‌‌‌‌‌‌‌‌ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినీతి జరిగిందని లోక్ సభ ఎన్నికల ప్రచారం తరహాలో వాదనలు వినిపించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చీఫ్‌‌‌‌‌‌‌‌  జస్టిస్‌‌‌‌‌‌‌‌  అలోక్‌‌‌‌‌‌‌‌  అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌  జె.అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్ తో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌ మంగళవారం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బి.రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కోదండరాం రెడ్డి, ముదుగంటి విశ్వనాథ రెడ్డి, బక్క జడ్సన్‌‌‌‌‌‌‌‌  వేసిన పిల్స్‌‌‌‌‌‌‌‌పై తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.