న్యాయం కోసం ఆరేళ్ల నుంచి పోరాటం

న్యాయం కోసం ఆరేళ్ల నుంచి పోరాటం

పెబ్బేరు, వెలుగు: బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి తన భూమిని వేరే వాళ్ల పేరుపై పట్టా చేశారని ఓ వ్యక్తి హ్యుమన్​రైట్స్​కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ చెల్లిమిల్లకు చెందిన కుక్కన్నకు వారసత్వంగా ఎకరం 15 గుంటల భూమి వచ్చింది. 2015లో తాను చనిపోయినట్లు అప్పటి తహసీల్దార్​తప్పుడు సర్టిఫికెట్​సృష్టించాడని, 2013లో చనిపోయిన తన తల్లి సవరమ్మ మరో వ్యక్తికి పొలం అమ్మినట్లు రికార్డుల్లో ఎక్కించారని కుక్కన్న పేర్కొన్నాడు. తన భూమిని కాజేయడానికి యత్నించిన తహసీల్దార్,​ ఇతర ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని, తన భూమిని తనకు అప్పగించాలని కోరాడు. ఇదే విషయంపై ఆరేండ్లుగా పోరాడుతున్నానని, జిల్లా కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

హైకోర్టులో కేసు నడుస్తుండగానే..

భూ వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తుండగానే తహసీల్దార్​తన పొలాన్ని వేరేవాళ్ల పేరుపై పట్టా చేశారంటూ వనపర్తి జిల్లా వీపనగండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్​గౌడ్​హెచ్చార్సీలో ఫిర్యాదు చేశాడు. పట్వారి, పటేల్​ హయాంలో తన తండ్రి అక్కల శివన్న గౌడ్​బతికుండగానే చనిపోయినట్లు కాగితాలు సృష్టించి భూమిని వేరే  వాళ్లపై పట్టా చేశారన్నారు. ఇదే విషయంపై హైకోర్టు నుంచి తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్​కు స్టే ఆర్డర్​కాపీ వచ్చిందని, కోర్టులో కేసు నడుస్తుండగానే 2019లో వీపనగండ్ల తహసీల్దార్​తమ 12 ఎకరాల 30 గుంటల భూమిని వేరే వాళ్లపై పట్టా చేశారని చెప్పారు. డబ్బులకు అమ్ముడుపోయి తమ భూమిని ఇతరులపై పట్టా చేసిన తహసీల్దార్, ఇతర అధికారులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని శ్రీనివాస్​గౌడ్​కోరారు. అక్రమాలకు పాల్పడిన తహసీల్దార్​శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేంధర్​గౌడ్​మానవ హక్కుల కమిషన్​ను కోరారు.