
భూ తగాదాల వల్ల ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. పట్టపగలే పచ్చని పొలాల మధ్య అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. కొట్టొద్దని అక్కడున్న ఓ మహిళా వేడుకున్నా వినకుండా అతడిని చితకబాదారు దాయాదులు. చాలా మంది గుమిగూడి చూస్తున్నారు తప్ప ఎవరూ ఆపలేదు. ఈ ఘటనను అక్కడున్న వారిలో ఎవరో వీడియో తీశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో జరిగింది.
చిన్నపొర్ల గ్రామానికి చెందిన గువ్వల సంజప్ప (28)అనే వ్యక్తికి మరో వర్గానికి మధ్య కొంత కాలంగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సంజప్ప అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం దగ్గర కర్రలతో కొట్టారు. తీవ్రగాయాలైన సంజప్పను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.