18న భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్

18న భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్
  • కిలోమీటర్ సైజుండే  ప్రమాదకర ఆస్టరాయిడ్

వాషింగ్టన్: కిలోమీటర్ సైజుండే ఓ పెద్ద ఆస్టరాయిడ్ భూమి దిశగా పరుగు పరుగున వస్తోంది. గంటకు 70,416 కిలోమీటర్ల వేగంతో వస్తున్న ఆస్టరాయిడ్ 7482 (1994పీసీ1)​ వచ్చే మంగళవారం భూమికి 19.3 లక్షల కిలోమీటర్ల దూరం నుంచే దూసుకుపోనుంది. ప్రస్తుతం ఆ ఆస్టరాయిడ్​ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ట్రాక్ చేస్తోంది. మళ్లీ 200 ఏండ్ల దాకా ఏ ఆస్టరాయిడ్​ కూడా భూమికి ఇంత దగ్గరగా రాదని సైంటిస్టులు చెప్తున్నారు. కిలోమీటరు సైజుండడం వల్ల అది ప్రమాదకరమైన ఆస్టరాయిడ్ అని సైంటిస్టులు అంటున్నారు.

మామూలుగా 460 అడుగుల కన్నా పెద్దగా ఉండే గ్రహ శకలాలను ఆస్టరాయిడ్లు అని పిలుస్తుంటారు. సూర్యుడి చుట్టూ ఉండే భూ కక్ష్యలో 75 లక్షల కిలోమీటర్ల దూరంలో అవి తిరుగుతుంటాయి. ఈ జనవరిలో ఇప్పటికే మూడు ఆస్టరాయిడ్లు భూమికి దగ్గరి నుంచి వెళ్లాయి కానీ.. మరీ ఇంత దగ్గరగా మాత్రం వెళ్లలేదని, వాటి సైజు కూడా ఇంత పెద్దగా లేదని నాసా అంటోంది. ఆ మూడింట్లో 22021వైక్యూ అనే ఆస్టరాయిడే అతిపెద్దదని, దాని వెడల్పు 49 నుంచి 110 మీటర్లుందని చెప్తోంది.

ఈ లెక్కన జనవరి 18న భూమికి దగ్గరగా వచ్చే ఆస్టరాయిడ్​ చాలా భారీదేనని అంటోంది. అయితే, అంత దగ్గరగా వచ్చినా దాని వల్ల భూమికి వచ్చే ప్రమాదమైతే ఏమీ లేదని ఆస్ట్రానమర్లు భరోసానిస్తున్నారు. ఇలాంటి భారీ గ్రహశకలాలు 6 లక్షల ఏండ్లకోసారి మాత్రమే భూమిని ఢీకొట్టే ప్రమాదముందని చెప్తున్నారు. ఆస్టరాయిడ్​ 7482ను 1994 ఆగస్టు 9న రాబర్ట్ మెక్​ నాట్​ అనే ఆస్ట్రేలియన్​ గుర్తించాడు.