తుఫాన్ ధాటికి కొట్టుకొచ్చిన ర‌థం.. ఏ దేశానిది..?

తుఫాన్ ధాటికి కొట్టుకొచ్చిన ర‌థం.. ఏ దేశానిది..?

శ్రీకాకుళం: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రతుఫాను నుంచి తుఫానుగా అసని బలహీనపడిందని తెలిపింది వాతావరణ శాఖ. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది అసని తుఫాను. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.కాకినాడ దగ్గర మళ్లీ సముద్రంలోకి వచ్చి బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపింది విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు సాయంత్రానికి వాయుగుండగా తుఫాను బలహీనపడనుంది. తీరానికి అతి దగ్గరగా రావడంతో గాలుల తీవ్రత తగ్గింది. తుఫాను కారణంగా 3 మీటర్ల ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. 

అస‌ని తుఫాన్‌తో బంగాళాఖాతంలో భీక‌ర అల‌జ‌డి ఉంది. ఏపీ తీరం వెంట స‌ముద్రం ఉప్పొంగుతోంది. అయితే ఆ తుఫాన్ ధాటికి కోస్తాంధ్రా తీరానికి వింత ర‌థం కొట్ట‌కువ‌చ్చింది. సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు బంగారు వర్ణం కలిగిన రధం ఒక‌టి కొట్టుకువ‌చ్చింది. ఆ ర‌థాన్ని వీక్షించేందుకు స్థానిక ప్ర‌జ‌లు ఎగ‌బ‌డుతున్నారు. సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి సముద్రం రేవుకు ఎప్పుడు చూడని వింతైన రధం మంగ‌ళ‌వారం కొట్టుకు వ‌చ్చిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. బహుశా ఆ ర‌థం మ‌రో దేశం నుంచి వ‌చ్చి ఉంటుంద‌ని నౌపాడా ఎస్సై తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారుల‌కు ఈ విష‌యాన్ని చెప్పామ‌ని, ఉన్న‌తాధికారులు దీన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.