ఇసుక మైనింగ్ రేట్లపై హైకోర్టులో పిటిషన్

ఇసుక మైనింగ్ రేట్లపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్, వెలుగు: పట్టా భూములలో ఇసుక మైనింగ్‌‌ రేట్లను ప్రభుత్వం నిర్ణయించడాన్ని సవాల్‌‌ చేసిన కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇసుకకు ఏ ప్రాతిపదికపై ప్రభుత్వం ధర నిర్ణయించిందో చెప్పాలని ఆదేశించింది. ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామస్తుడు ఎం.సుధీర్‌‌ దాఖలు చేసిన రిట్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌రెడ్డి బెంచ్‌‌ బుధవారం విచారించింది. పిటిషనర్‌‌కు జంపన్నవాగుకు పక్కన భూమి ఉందని, ఇసుక తవ్వేందుకు గనుల శాఖ నుంచి పర్మిషన్‌‌ కూడా తీసుకున్నారని, అయితే క్యూబిక్‌‌ మీటర్‌‌ ఇసుక రేటు రూ.100గా మైనింగ్‌‌ అధికారులు నిర్ణయించడం అన్యాయమని పిటిషనర్‌‌ లాయర్‌‌ మల్లిక్‌‌ వాదించారు.

అక్రమ మైనింగ్‌‌ ఆపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిన ధర అన్యాయంగా ఉందన్నారు. టీఎస్‌‌ఎండీసీ పట్టా ల్యాండ్‌‌ నుంచి తవ్విన ఇసుకను క్యూబిక్‌‌ మీటర్‌‌ ధర రూ.600గా ఉందని, రైతులకు అన్యాయం జరిగేలా మైనింగ్‌‌ శాఖ.. పిటిషనర్‌‌ భూమిలోని ఇసుకకు ధర నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. విచారణ నవంబర్‌‌ 21కి వాయిదా పడింది.