
న్యూఢిల్లీ: కిందటి రెండేళ్ల కాలంలో దేశంలో 36 వేలకి పైగా ఉద్యోగాలు పోయినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. లిడో లెర్నింగ్, సూపర్లెర్న్, గోనట్స్ వంటి 9 కంపెనీల తాజా డేటా కూడా ఇందులో ఉందని లేఆఫ్.ఎఫ్‌వైఐ తన రిపోర్టులో పేర్కొంది. పై 9 కంపెనీలు మొత్తం ఉద్యోగులందరినీ ఇంటికి పంపినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. టెక్ సెక్టార్ జాబ్స్‌ను ఈ వెబ్సైట్ ప్రత్యేకంగా ట్రాక్ చేస్తుంది. గోమెకానిక్, ఫాబిల్కేర్, ఎంఫైన్ వంటి 5 కంపెనీలు తమ ఉద్యోగులలో 70–75 శాతం మందిని తీసేసినట్లు ఈ రిపోర్టు తెలిపింది.
4 వేల మంది ఉద్యోగులను తీసేసిన బైజూస్ ఈ లిస్టులో టాప్ పొజిషన్లో ఉంది. వైట్‌హ్యాట్ జూనియర్ 1800 ఉద్యోగులను జనవరి 2021 లోను, మరో 300 మంది ఉద్యోగులను జూన్ 2022 లోనూ ఇంటికి పంపించింది. జనవరి 2021 లో బైట్‌డాన్స్ 1800 మందిని జాబ్స్ నుంచి తొలగించింది.
జూన్2020 లో పైసాబజార్ 1,500 జాబ్స్అంటే తన ఉద్యోగులలో సగం మందిని తీసేసింది. మే 2020 నుంచి స్విగ్గీ 2,880 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు జొమాటో మాత్రం 620 మంది ఉద్యోగులనే తీసేసింది. మే 2020 నుంచి ఇప్పటిదాకా ఓలా నాలుగు సార్లు ఉద్యోగులను తొలగించిందని ఈ రిపోర్టు పేర్కొంది