ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుస చోరీలు.. జనం బెంబేలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుస చోరీలు.. జనం బెంబేలు
  • తాళం వేసిన ఇళ్లు, దుకాణాలే టార్గెట్
  • ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన దొంగతనాలు
  • పెట్రోలింగ్​ పెంచాలంటున్న ప్రజలు

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: వరుస దొంగతనాలతో జనం బెంబేలెత్తుతున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్​చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్తున్నారు. కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు పెరిగిపోయాయి.  మెదక్​ జిల్లాలోని తూప్రాన్​ పట్టణంలో రెండు నెలల వ్యవధిలో 15 కు పైగా చోరీలు జరిగాయి. 

పక్షం రోజుల క్రితం  పట్టణంలో మెయిన్ ​రోడ్డును అనుకుని ఉన్న ఓ సిమెంట్, స్టీల్ దుకాణం పైరేకులు తొలగించి లోపలికి చొరబడి రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.  ఫిబ్రవరి 6న తూప్రాన్ పట్టణంలోని రెండు దుకాణాల్లో దొంగలు పడి నగదు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ నెల16న తూప్రాన్​ మండలం వెంకటాయపల్లిలో రెండిళ్లలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన మహేశ్​ తన సోదరుడి ఇంట్లో వ్రతం ఉండడంతో వెళ్లగా దొంగలు తాళం పగులగొట్టి తులంన్నర బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. 

సత్యనారాయణ గౌడ్​ ఇంటి తాళం పగులగొట్టి రూ.5 వేలు ఎత్తుకెళ్లారు. జనవరి 5న అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో తాళాలు వేసి ఉన్న 11  ఇండ్లలో దొంగలు పడ్డారు. 8 ఇండ్లలో బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన బండారి మూర్తి ఇంట్లో తులం బంగారం,  రూ.10 వేల నగదు, హన్మకాడి బాబు ఇంట్లో రూ.35 వేల నగదు, రామకిష్టయ్య ఇంట్లో తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈనెల 16న కొల్చారం మండలం చిన్నఘనపూర్​లో రెండిళ్లలో దొంగలు పడ్డారు. గోపాల్​ ఇంట్లో తులం బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. వడ్ల వీరేశం ఇంట్లో మూడు తులాల బంగారం, ఆరు తులాల వెండి  ఆభరణాలు, రెండు వేల నగదు ఎత్తుకెళ్లారు. 

సిద్దిపేట జిల్లాలో..

 కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో ఒకే రోజు ఆరు ఇండ్ల తాళాలు పగులగొట్టిన రూ.3 లక్షలపై చిలుకు నగదుతో పాటు, 6 తులాల బంగారం, 30 తులాల వెండిని చోరీ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో  నాలుగిండ్ల లో దొంగలు పడి రూ.6 లక్షల నగదు, 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. రావూస్ కాలనీలో  పెద్ది రవీందర్ ఇంట్లో 5 తులాల బంగారం, రూ.50 వేల నగదు,  రెడ్డి కాలనీలో కాయిత విశాల్ ఇంట్లో  2 తులాల బంగారం, రూ.1.50 లక్షలు నగదు,  ముదిరాజ్ కాలనీలో వెల్దండి రాజేంద్రప్రసాద్ ఇంట్లో 8 తులాల బంగారం, రూ.60 వేల నగదు,  పాత శివాలయం వెనుక వీధిలోని  వంగర రాజిరెడ్డి ఇంట్లో 2 తులాల బంగారం, రూ. లక్ష నగదు తస్కరించారు. 

దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలో ఒకే రోజు  ఐదు ఇండ్ల  తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడి లక్ష రూపాయల నగదు చోరీ చేశారు. చేర్యాల మండలం ఆకునూరులో రణం కిష్టయ్య ఇంట్లో,  ముస్త్యాలలో శ్యామల రామస్వామి ఇంట్లో చోరీకి పాల్పడి నగదు తో పాటు నగలను ఎత్తుకెళ్లారు.  చేర్యాల మండలం తాడూరు గ్రామానికి చెందిన నర్ర తార ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లగా బీరువాలోని  రూ.12 వేల నగదు,  ఆరు తులాల బంగారు, 240 గ్రాముల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. 

ALSO READ : మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం ఒక్క రోజే 5లక్షల మంది దర్శనం

కొండపాక మండలం  తిమ్మారెడ్డిపల్లిలో  సున్నం రాజయ్య ఇంటి తాళాలు పగులగొట్టి  రూ.1.50 లక్షల నగదు, అదే గ్రామానికి చెందిన  వడ్ల సత్యవ్వ  ఇంట్లో 3 తులాల బంగారం, చిలుముల సత్తయ్య ఇంట్లోంచి రూ.3 లక్షల నగదును చోరీ చేశారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో గుడ్ల  లక్ష్మణ్ అత్తగారింటికి వెళ్లగా  ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒకరి ఇంట్లో రూ.15 వేలు, మరొక ఇంట్లో రూ. 5 వేలతో పాటు అర తులం బంగారం ఎత్తుకెళ్లారు.

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట, అమీన్ పూర్ ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అమీన్ పూర్ లోని పలు కాలనీలలో చెడ్డి గ్యాంగ్ తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. సదాశివపేట మున్సిపల్ పరిధిలో గత నెలలో వరుసగా ఏటీఎంలలో దొంగతనాలు జరిగాయి. తిలక్ రోడ్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి రూ.14.50 లక్షలు, మరుసటి రోజు  గంజి రోడ్ లో ఉన్న మరో ఎస్బీఐ ఏటీఎంలో రూ.4.30 లక్షలు చోరీ చేశారు. 

రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో బైక్ లు ఎత్తుకెళ్తున్నారు. జహీరాబాద్ పట్టణంలో శనివారం దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. చెక్‌పోస్ట్ వద్ద ఉన్న వినాయక వైన్స్, పస్తాపూర్ చౌరస్తాలోని జై భవాని వైన్స్, ఓల్డ్ వాణి జూనియర్ కాలేజ్ వద్ద 3 బట్టల షాప్​ల్లో, సుభాష్ గంజ్‌లోని గణేశ్ సాయి ట్రేడర్స్​లో దొంగతనానికి పాల్పడి అందినకాడికి దోచుకెళ్లారు.

దొంగలను పట్టుకుంటాం

 తూప్రాన్ డివిజన్ కేంద్రంలో జరుగుతున్న దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు జరిగిన చోరీల్లో నిందితులుగా అనుమానిస్తున్న వారి కోసం గాలిస్తున్నాం. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. రాత్రి వేళల్లో నిఘా పెంచి దొంగతనాలు జరగకుండా చూస్తాం. 
యాదగిరి, తూప్రాన్ డీఎస్పీ