మేడారానికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం ఒక్క రోజే 5లక్షల మంది దర్శనం

మేడారానికి  పోటెత్తిన భక్తులు.. ఆదివారం ఒక్క రోజే 5లక్షల మంది దర్శనం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు:  మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5లక్షల మంది గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 21 నుంచి నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది. ప్రారంభానికి ఇంకా రెండు రోజులే ఉండటంతో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. ఊరట్టం, తాడ్వాయి, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలన్నీ వెహికల్స్​తో నిండిపోయాయి. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడిపిస్తున్నది. వెయ్యి మంది పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గద్దెల దగ్గరికి అనుమతించలేదు. గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్​కు తాళాలు వేసి ఉంచారు.

జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలు

మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అక్కడి నుంచి బెల్లం షాపుల కు చేరుకుని తులాభారం వేసుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వన దేవతలకు పసుపు, కుంకుమ, బెల్లం, చీర సారెను సమర్పించుకున్నారు. ఎదురుకోళ్ల మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత కోళ్లు, ఏటపోతులు బలిచ్చారు. శివసత్తుల పూనకాలతో గద్దెల ప్రాంగణమంతా కిటకిటలాడింది. 

ALSO READ : ఇక నామినేటెడ్ జాతర .. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 ఏఎంసీల కమిటీలు రద్దు

మహా జాతరకు రెండు రోజులు ముందే పండుగ వాతావరణం కనిపిస్తున్నది. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డీపీవో వెంకయ్య పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.

నేడు మేడారానికి మంత్రుల బృందం

మహాజాతర సందర్భంగా సోమవారం నలుగురు మంత్రులు మేడారంలో పర్యటించనున్నారు. రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అలాగే, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ఆదివారం ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజ అమ్మవార్ల గద్దెల ప్రాంగణాలు, హరిత హోటల్, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. వారివెంట దేవాదాయ శాఖ అధికారి రాజేందర్, ప్రొటోకాల్ ఆఫీసర్ రాజ్ కుమార్, ఎమ్మార్వో తోట రవీందర్ తదితరులు ఉన్నారు.