ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రశాంత్‌రెడ్డిపై ఎంపీ అర్వింద్ ధ్వజం

నిజామాబాద్, వెలుగు: జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి కుల్వకుంట్ల కుటుంబానికి బానిసగా మారాడని ఎంపీ అర్వింద్ విమర్శించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శలను ఖండిస్తూ ఎంపీ ప్రెస్​నోట్ విడుదల చేశారు.   కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా మారిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు నోటికొచ్చినట్టు మాట్లాడిన మాటలను పట్టించుకోనన్నారు. ఇటువంటి వ్యక్తుల మాటలు విన్నా, ముఖాలు చూసినా ఎలాంటి ప్రయోజనంలేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారి మాటలను పక్కకు పెట్టి తన పని తాను చేసుకుంటూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రి పనికిమాలిన ప్రెస్​మీట్లు మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జీలను పూర్తి చేయాలన్నారు. టీఆర్‌‌ఎస్‌ గూండాలు ఎన్ని దాడులు చేసినా తాను కాని తన కుటుంబం కాని భయపడదని పేర్కొన్నారు.

లైబ్రరీలతోనే సాంస్కృతిక చైతన్యం

కామారెడ్డి, వెలుగు: భాష, సాహిత్య, సాంస్కృతిక చైతన్యం లైబ్రరీలతోనే  సాధ్యమని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. లైబ్రరీలకు వెళ్లే అలవాటును బాల్య దశ నుంచే అలవాటు చేసుకోవాలన్నారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లా శాఖ లైబ్రరీలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌‌కు కలెక్టర్​ చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరై మాట్లాడుతూ బుక్స్ రీడింగ్‌‌తో భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవచ్చన్నారు. జిల్లా లైబ్రరీలో అనేక వసతులు ఉన్నాయని, వీటిని యువత వినియోగించుకోవాలన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ పున్న రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే లైబ్రరీలపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. రెడ్ క్రాస్ సోసైటీ చైర్మన్ ఎం.రాజన్న, ప్రతినిధులు కొత్తింటి శ్రీనివాస్‌‌రెడ్డి, బాస రఘుకుమార్​, గఫూర్ శిక్షక్, శంకర్ పాల్గొన్నారు.  

గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మారారు

నిజామాబాద్, వెలుగు: గవర్నర్ తమిళిసై తన విధులు మరిచి బీజేపీ నాయకురాలిగా మారారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ అర్వింద్​ ఇంటిపై దాడిని ఖండించిన గవర్నర్ టీఆర్‌‌ఎస్‌ నాయకుల ఇండ్లపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా తాము ఓడిస్తామన్నారు. సమావేశంలో జడ్పీచైర్మన్‌ విఠల్​రావు తదితరులు పాల్గొన్నారు. 

డొంకేశ్వర్ మండల అభివృద్ధికి కృషి

నందిపేట: డొంకేశ్వర్ మండల సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి అన్నారు. కొత్తగా ఏర్పాటైన డొంకేశ్వర్ మండల కార్యాలయాలను ఆదివారం ఆయన అధికారికంగా  ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్ తహసీల్దార్‌‌గా బాధ్యలు చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రానికి ఎదురులేదన్నారు. జడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు, సర్పంచ్ చాయా చందు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్లు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధిపై దృష్టి

మాక్లూర్, వెలుగు: మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. ఆదివారం మాక్లూర్ మండల కేంద్రంలోని చింతల చెరువులో 60,700 చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి, సర్పంచ్ అశోక్‌కుమార్‌‌, ఫిషరీస్ ఏడీ రాజ్ నర్సయ్య, ఎంపీటీసీ వెంకటేశ్వర్‌‌రావు, హైమద్, కిషన్‌రావు, గంగపుత్ర సంఘం దిలీస్, వీడీసీ ప్రసాద్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, మేకల రవి, కొండ్ర నర్సయ్య పాల్గొన్నారు. 

ముగిసిన రాష్ట్ర సాఫ్ట్ బాల్ పోటీలు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్‌లో రెండు రోజుల పాటు జరిగిన 7వ రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో మెదక్ జిల్లా జట్టు ప్రథమ, నిజామాబాద్ జట్టు ద్వితీయ, మంచిర్యాల జట్టు తృతీయ స్థానాలు పొందాయి. టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డి.వినీశ్‌, మహిపాల్, శశాంక్, లక్వేందర్‌‌కు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌‌పర్సన్ పండిత్ వినీత పవన్ హాజరై బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్‌లో ఈనెల 25 నుంచి 29 వరకు జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శోభన్ బాబు, ప్రిన్సిపాల్ దుర్గారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, రాష్ట్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి అభిషేక్ గౌడ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి మరికంటి సుజాత, బీసీ సంఘం ప్రెసిడెంట్ అశోక్‌గౌడ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్, మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అజయ్‌గౌడ్, పీఈటీలు వినోద్, రంజిత్, సంతోష్ ,అన్వేష్, మహేశ్‌, సాఫ్ట్  బాల్ అకాడమీ కోచ్ నరేశ్‌ పాల్గొన్నారు.

సామాన్యుల నడ్డి విరుస్తున్న కేసీఆర్‌‌

మోర్తాడ్, వెలుగు: ఆర్టీసీ, కరెంట్‌ చార్జీలు పెంచి సీఎం కేసీఆర్‌‌ సామాన్యుల నడ్డి విరుస్తున్నాడని బీజేపీ నేత మల్లికార్జున్‌రెడ్డి అన్నారు. జనం తో మనం మహా పాదయాత్రలో భాగంగా ఆరో రోజైన ఆదివారం బాల్కొండ మండలం కొత్తపల్లి, వేంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పాదయాత్ర మొదలుపెట్టిందే జనం సమస్యలు, వారు పడుతున్న బాధలు తెలుసుకునేందుకే అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్న  సంకల్పంతో అవాస్ యోజన పథకం ద్వారా 3 కోట్ల ఇల్లు దేశవ్యాప్తంగా కట్టిస్తే.. ఎక్కడ మోడీకి పేరోస్తుందోనని కేసీఆర్‌‌ డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ తెచ్చి పేదలకు ఇల్లు ఇయ్యకుండా అడ్డుకుంటున్నడని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు. యాత్రలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్, బాల్కొండ మండల ప్రెసిడెంట్ అంబటి నవీన్, కమ్మర్‌పల్లి, భీంగల్, మోర్తడ్, ఎర్గట్ల, ముప్కాల్, మెండోరా, భీంగల్‌ నాయకులు పాల్గొన్నారు.

దివ్యాంగ ఉద్యోగుల సమస్యలపై పోరాటం

నిజామాబాద్ రూరల్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ రాజు అన్నారు. ఆదివారం నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే ప్రమోషన్లలో దివ్యాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని, ఆదాయ పన్నులో ప్రత్యేక మినహాయింపు ఇవ్వాలని కోరారు. దివ్యాంగులకు వికలాంగ బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న మిర్యాలగూడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సమావేశానికి తరలిరావాలని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి బాబారావు, గౌరవ అధ్యక్షుడు రాజన్న, కొట్టిరెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, వసంత, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసిన్రు

కామారెడ్డి, వెలుగు: ప్రజా సమస్యలను స్టేట్ గవ ర్నమెంట్ గాలికొదిలిందని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఆదివారం దోమకొండ మండలంలో ముత్యంపేటలో  వివిధ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్‌‌ఎస్‌ పాలనను పూర్తి గా పక్కకు పెట్టిందని ఆరోపించారు. ధరణితో రైతులు సతమతమవుతున్నారన్నారు. వడ్లు అమ్మి న పైసలు అకౌంట్లలో సకాలంలో జమ కావడం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయన్నారు. బీజేపీ దాడులకు భయపడదన్నారు. స్టేట్‌లో వచ్చేది బీజేపీ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారే అన్నారు.  పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.